ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్న వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలి

ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్న వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలి

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ సందర్భంగా వేల మంది జ‌నం గుమిగూడారని, ప్రచారం లో పాల్గొన్న వారంతా 5 నుంచి 7 రోజులు క్వారంటెయిన్ ఉండాల‌న్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. బుధ‌వారం న‌గ‌రంలోని కోఠి లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. . ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్‌ నియంత్రణలో ఉందని, పాజిటివ్ పర్సెంటేజ్ 1 శాతం మాత్రమే ఉందన్నారు. యాక్టీవ్ కేసులు, మరణాలు తక్కువ.. రికవరీ రేట్ ఎక్కువగా ఉందని అన్నారు. అయితే ఎన్నిక‌ల వేళ ప్ర‌చారం నిర్వ‌హించిన కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ ఐసోలేషన్ లో ఉండాల‌ని, కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టాల‌ని ఆయ‌న అన్నారు. ల‌క్ష‌ణాలు ఉంటే టెస్ట్‌లు చేయించుకోవాల‌న్నారు.

క‌రోనా బాధితుల కోసం ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుప‌త్రుల్లో 88 % శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నాయని, సీఎం, మంత్రి ఈటల ఎప్పటికప్పుడు క‌రోనా తీవ్ర‌త‌పై రివ్యూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 65 వేలకు పైగా టెస్ట్ లు చేయగల కెపాసిటీ ఉందని .. 1096 సెంటర్స్ లో టెస్ట్ లు చేస్తున్నామని ఆయ‌న అన్నారు. మరో 50 సెంటర్స్  కొత్తగా ప్రారంభిస్తున్నామ‌ని, వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 25 సెంట‌ర్లు ఉన్నాయ‌న్నారు. స్టేట్ ఏపీడమిక్ సెల్ ప్రారంభిస్తున్నామ‌ని… ల‌క్ష‌ణాలు ఉన్న వారు ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో 040 24651119 కాల్ చేసి తెలుసుకోవ‌చ్చ‌ని సూచించారు. సెకండ్ వేవ్ అన్నది ప్రజల ప్రవర్తన మీద ఆధార పడి ఉంటుందని, జనవరి వరకు జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.