దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, హన్మకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడికి చెందిన 'నాట్య మండపం' (కల్యాణ మండపం) మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలో శిథిలమైన రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చి, అత్యంత అద్భుతంగా దీనిని తిరిగి నిర్మించారు.
12వ శతాబ్దంలో కాకతీయులు ఉపయోగించిన అదే పురాతన సాంకేతికత(శాండ్‌బాక్స్ టెక్నాలజీ)ను వాడి దీనిని పునర్నిర్మించారు. అంటే, నేల అడుగున ఇసుక పొరలను ఏర్పాటు చేసి, దానిపై భారీ రాతి కట్టడాన్ని నిలబెట్టారు. గతంలో దాడిలో దెబ్బతిన్న నంది విగ్రహం కాలు, తోక భాగాలను ఇప్పుడు పూర్తిస్థాయిలో సరిచేశారు.
42 ఏళ్ల కృషితో 1984లో వరంగల్ REC (ప్రస్తుత NIT) ప్రొఫెసర్ పాండురంగారావు గారు ప్రారంభించిన ఈ పరిశోధన, ఇప్పుడు విజయవంతంగా ముగిసింది.
కల్యాణ మండపానికి సంబంధించిన దాదాపు 4,000 పైగా రాళ్లను విడివిడిగా తీసి, నంబర్లు వేసి, మళ్లీ పాత పద్ధతిలోనే పేర్చారు. ఇందులో 132 స్తంభాలకు గాను 119 పాతవి దొరకగా, మిగిలిన వాటిని తమిళనాడు శిల్పులతో కొత్తగా చెక్కించారు. పాత కాలంలో రాళ్లను కలపడానికి ఇనుప చువ్వలు వాడేవారు, అవి తుప్పు పట్టడంతో ఇప్పుడు వాటి స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్ చువ్వలను వాడారు.
ఎందుకు కూలిపోయిందంటే
1323లో ఉలుఘ్ ఖాన్ దాడి సమయంలో ఈ ఆలయం ధ్వంసమైంది. కాలక్రమేణా ఆలయ పునాదిలో ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో, భారీ బరువున్న నాట్య మండపం భూమిలోకి కుంగిపోయింది.
వెయ్యి స్తంభాల పేరు ఎందుకు వచ్చిందంటే
ఈ ఆలయంలో స్తంభాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు, కొన్ని పెద్ద స్తంభాల మీద మళ్లీ చిన్న చిన్న స్తంభాల ఆకారంలో అద్భుతమైన చెక్కడాలు (Vertical Carvings) ఉన్నాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
"ఈ పునర్నిర్మాణం తర్వాత, ఈ కల్యాణ మండపం మరో వెయ్యేళ్ల పాటు పదిలంగా ఉంటుంది" అని ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన పాండురంగారావు గారు ధీమా వ్యక్తం చేశారు. దింతో కాకతీయుల నాటి కళా వైభవం మళ్లీ మన కళ్లకు కట్టనుంది.
