ముంబై: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గాలివాన బీభత్సం సృష్టించడంతో గ్రౌండ్ సపోర్టింగ్ పరికరాలు ఢీకొని ఎయిరిండియా విమానాలు మూడు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముందస్తు జాగ్రత్తగా ఆ మూడు విమానాల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి, తనిఖీల కోసం పంపించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
టెర్మినల్–-2 వద్ద నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలకు చెందిన గ్రౌండ్ సపోర్టింగ్ పరికరాలు తమ స్థానాల నుంచి వేగంగా కదిలాయి. గాలి వేగానికి కొట్టుకుని వచ్చిన ఈ పరికరాలు.. అక్కడ పార్క్ చేసి ఉన్న విమానాలను బలంగా ఢీకొట్టాయి. దీంతో ఆ నారోబాడీ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం నిరాకరించింది. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఇతర సంస్థల విమానాలు కూడా దెబ్బతిన్నాయని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదానికి గురైన మూడు విమానాలలో రెండు త్వరలోనే మళ్లీ అందుబాటులోకి వస్తాయని, మూడో విమానం మరమ్మతులకు మాత్రం మరికొంత సమయం పడుతుందని చెప్పారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. విమానాల నష్ట తీవ్రతపై విచారణకు ఆదేశించింది.
