చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు

చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు

GHMC తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలలా పైన ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ ఏడాది కురిసిన వర్షాలతో  పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని పలు కాలనీలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇతర మున్సిపల్ పట్టణాల్లోనూ వరద ప్రభావం విస్తృతంగా కనిపించింది. ఈ క్రమంలో అందుకు కారణమైన చెరువులు, నాలాల పైన సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్ . ఇరిగేషన్, జలమండలి, HMDA రెవెన్యూ యంత్రాంగం తో పాటు ఇతర శాఖలతో కలిసి ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం GHMC పరిధిలో ఉన్న చెరువులు, నాలలు అన్నింటిపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం జరగాలని ఈసందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువుల యొక్క నీటి మట్టాలతో పాటు వాటి వరద ప్రభావ పరిస్థితులు, చెరువుల గట్టు  యొక్క బలోపేతంతో పాటు వాటి బలాన్ని  తెలుసుకునే విధంగా ఈ అధ్యయనం జరగాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర చెరువులు, నాలలకు సంబంధించి పలు అధ్యయన నివేదికలు ఉన్నప్పటికీ, వాటికి అదనంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాగునీటి శాఖతో కలిసి ఈ అధ్యయనం జరపాలని అధికారులను కోరారు.

ప్రస్తుతం నగరంలో ఉన్న చెరువుల చెరువు కట్టల బలోపేతం, అవసరమైతే ఆయా చెరువులకు అవసరము అయిన ఇంతర నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు చెరువులకు సంబంధించి ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విభాగానికి సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ ఒకరు నాయకత్వం వహిస్తారని, GHMC తరపున ప్రత్యేక కమిషనర్ ఒకరు ఉంటారని వారి ఆధ్వర్యంలో వాటర్ బాడీస్ యొక్క సంరక్షణ, అభివృద్ధి, దాని పరిధి లో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు వంటి కార్యక్రమాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుందన్నారు. దీంతోపాటు హైదరాబాద్ లో ని వాటర్ బాడీస్ పైన ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి ఇందులో జలమండలి, HMDA, రెవెన్యూ, సాగునీటి శాఖ మరియు పలు ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని, ఈ టాస్క్ ఫోర్స్  ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా పని చేస్తుందన్నారు. సాగునీటి శాఖ రిజర్వాయర్లలో వరద ప్రవాహాన్ని నియంత్రించిన తీరుగానే, ఎప్పటికప్పుడు కురిసే వర్షాలు, దానివల్ల వచ్చేటువంటి వరదను అంచనా వేస్తూ ఆయా చెరువుల్లో నీటి నిల్వలను, వాటర్ ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సమావేశంలో నిర్ణయించారు. GHMC కొత్త చట్టాన్ని తీసుకు రానున్న క్రమంలో ఆ చట్టంలో వాటర్ బాడీస్ సంరక్షణ కోసం కఠినమైన నిబంధనలను, నియమాలను చేర్చుతామన్నారు. చెరువులో అక్రమంగా భవనాలు నిర్మిస్తే, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేసే అధికారం పురపాలక శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.