సమస్యలకు నిలయంగా బాసరలోని ట్రిపుల్ ఐటీ

సమస్యలకు నిలయంగా బాసరలోని ట్రిపుల్ ఐటీ
  • ఇన్​చార్జీల పాలనలో వర్సిటీ ఆగం 
  • ఎనిమిదేండ్లుగా రెగ్యులర్ వీసీ లేరు 
  • రిటైర్డ్ ఉద్యోగి చేతిలో 8వేల మంది విద్యార్థుల భవిష్యత్ 
  • మూడేండ్ల నుంచి లాప్​టాప్​లు, యూనిఫామ్స్, షూస్ ఇవ్వట్లే
  •  నాణ్యత లేని ఆహారం, తాగునీటికి ఇక్కట్లు 

హైదరాబాద్, నిర్మల్, వెలుగు: గ్రామీణ, పేద విద్యార్థులు చదివే బాసరలోని ట్రిపుల్ ఐటీ సర్కారు నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారింది. ఇందులో చదివే 8వేల మంది విద్యార్థులు ఎన్నో ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. వర్సిటీకి ఎనిమిదేండ్ల నుంచి వైస్ చాన్స్​లర్ పోస్టు భర్తీ చేయకపోవడం సర్కారు తీరును స్పష్టం చేస్తున్నది. ట్రిపుల్  ఐటీలో డైరెక్టర్, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయకుండా ఇన్​చార్జీలతోనే నడిపిస్తున్నది. వర్సిటీ మొత్తాన్ని ఓ రిటైర్డ్ కిందిస్థాయి అధికారికి అప్పగించి చేతులు దులుపుకున్నది. ఇన్​చార్జీ వీసీలుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు హైదరాబాద్​లో ఉంటూ వర్సిటీకి వెళ్లడం లేదు. సరిపడా ఫ్యాకల్టీ లేక పోవడంతో చదువులు సరిగా సాగట్లేదు. తాగునీటి సమస్యతో ఇబ్బందుల పాలవుతున్నారు. నాణ్యతలేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఇప్పటికే చాలాసార్లు ఆందోళనకు దిగినా సర్కారులో చలనం రావట్లేదు.

కీలక పోస్టులన్ని ఖాళీ

రాజీవ్ గాంధీ నాలెడ్జీ టెక్నాలజీస్ ​యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ)లో ఏటా1500 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఇక్కడ కీలకమైన అధికారులెవ్వరూ లేరు. చాన్స్​లర్, వీసీ, డైరెక్టర్, రిజిస్ర్టార్.. ఇలా అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ వర్సిటీకి ఉమ్మడి రాష్ట్రంలో వీసీగా రాజ్ కుమార్ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ ​పూర్తిస్థాయి వీసీని నియమించ లేదు. కొంతకాలం సత్యనారాయణ, ఆ తర్వాత అశోక్​కుమార్ ఇన్​చార్జీ వీసీలుగా పనిచేయగా, ప్రస్తుతం సీఎంఓ సెక్రెటరీ రాహుల్ బొజ్జా కొనసాగుతున్నారు. అన్ని వర్సిటీలకు ఛాన్స్​లర్ గవర్నర్ ఉండగా, ఈ వర్సిటీకి మాత్రం విద్యావేత్త ఉంటారు. ఈ పోస్టు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఈ వర్సిటీలో కీలకమైన డైరెక్టర్ పోస్టు మూడేండ్ల నుంచి ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం ఈ వర్సిటీని ఓ కిందిస్థాయి అధికారిని అడ్మినిస్టేషన్ ఆఫీసర్ (ఏఓ)గా నియమించి ఆయన చేతిలో పెట్టింది.

విద్యార్థులు 8వేలు.. రెగ్యులర్ టీచర్లు 19 మంది!

ప్రస్తుతం ఆరేండ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో సుమారు 8 వేల మంది చదువుతున్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు146 సాంక్షన్ టీచింగ్ పోస్టులుండగా, వారిలో19 మంది వర్కింగ్​లో ఉన్నారు. వీరిలోనూ కొందరు లాంగ్ లీవ్​లో ఉండగా ఉన్నది14 మంది మాత్రమే. మిగిలిన వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే. 

నాలుగేండ్లుగా యూనిఫామ్​ ఇవ్వట్లే

ఆర్జీయూకేటీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్​కు ల్యాప్ టాప్ ఇచ్చేవారు. దీంతో పాటు 2యూనిఫామ్స్, ఒక స్పోర్ట్స్ డ్రెస్, షూస్ అందించేవారు. కానీ 2019–20 నుంచి ఇవ్వడం లేదు. ఏటా రూ.10 కోట్లు ఇస్తే, ఇవన్నీ స్టూడెంట్లకు అందివ్వొచ్చు. కానీ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

లైట్లు, ఫ్యాన్లు కూడా పనిచేయట్లే

వర్సిటీలో మంచినీళ్లు శుద్ధిచేయకుండానే ఇస్తున్నట్టు విద్యార్థులు చెప్తున్నారు. భోజనం కోసం సర్కార్​ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.95 వరకూ ఇస్తున్నా.. కాంట్రాక్టర్లు నాసిరకం ఆహారం ఇస్తున్నారని చెప్తున్నారు. దీనిపై ఆందోళనలు చేసిన ఫలితం లేకుండా పోయింది. క్లాసు రూములు, హాస్టళ్లలో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు సరిపడ లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే  మూడేండ్ల కింద వంద ఏసీలు కొని రూముల్లో బిగించినా, వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. 

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కనీస సౌకర్యాలు కల్పించకుండా సర్కార్​విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉన్నత విద్యా సంస్థలు పోలీసుల నిర్బంధంలో కొనసాగించడం విచారకరం. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను, నేతలను నిర్బంధించడం అప్రజాస్వామికం.

- ఎంబడి చంద్రశేఖర్, నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు