రెజ్లింగ్ అంటే ఆ కుర్రాడికి పిచ్చి.. కానీ ఆ కుటుంబానికి దీనిని భరించే శక్తి లేదు..! కుటుంబ పోషణకు ఏదో ఓ ఉద్యోగం చేసుకోవాల్సిన దుస్థితి.. కానీ లెజెండ్స్ పరిచయంతో మారిన జీవితం…! సీన్ కట్ చేస్తే.. మూడేళ్లలో తన సూపర్ పెర్ఫామెన్స్‌తో ఇండియన్ రెజ్లింగ్‌లో సంచలనాలు సృష్టించిన 19 ఏళ్ల దీపక్ పూనియా.. ఇప్పుడు వరల్డ్ రెజ్లింగ్‌లో హాట్ కేక్..! బ్రెయిన్, పవర్, లక్, ఫ్లెక్సిబిలిటి.. మ్యాట్‌పై ఈ నాలుగు అంశాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దీపక్‌కు రెజ్లింగ్ అనేది ఓ కల. ఈ కలను సాకారం చేసుకోవడానికి అతను పడిన కష్టాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే..!!
వెలుగు క్రీడా విభాగం: దీపక్ పూనియాది.. హర్యానాలోని జజ్జర్ జిల్లాలో ‘చారా’ అనే ఓ మారుమూల గ్రామం. మధ్య తరగతి బ్రతుకులే అయినా.. ఆర్థికంగా చాలా వెనుకబడిన పరిస్థితి. దీని నుంచి గట్టెక్కేందుకు ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలనే తపన దీపక్‌ది. కానీ మనసులో ఏదో ఓ మూలన తనకు ఇష్టమైన రెజ్లింగ్‌కు దూరమవుతున్న బాధ. ఈ నేపథ్యంలో 2016కు ముందు ఆర్మీలో ఎంట్రీ లెవల్‌లో సిపాయి జాబ్‌కు ఎంపికయ్యాడు. షరా మామూలుగా ఉద్యోగమైతే చేస్తున్నాడు కానీ.. రెజ్లింగ్ ఆలోచనలు మాత్రం అతన్ని కుదురుగా ఉండనీయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని చత్రశాల స్టేడియంలో లెజెండరీ సుశీల్ కుమార్‌తో పరిచయం కావడం తన అదృష్టాన్నే మార్చేసింది. ‘చిన్న లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా రెజ్లింగ్‌ను ప్రయారిటీగా తీసుకో. పెద్ద టార్గెట్‌ను పెట్టుకుని అందుకు అనుగుణంగా కష్టపడితే పెద్ద జాబ్స్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి’ అని సుశీల్ చెప్పిన మాటలు ఓ మంత్రంలాగా పని చేశాయి. కలిసినప్పుడల్లా దీపక్‌లో స్థైర్యాన్ని నింపడంతో పాటు ఓ స్పాన్సర్‌షిప్ కల్పించి అండగా నిలిచాడు. ఇక సుశీల్ ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణను గుండెల నిండా నింపుకున్న దీపక్.. మూడేళ్లు కఠోర శ్రమతో రెజ్లింగ్‌కే అంకితమయ్యాడు. 2016లో వరల్డ్ క్యాడెట్ చాంపియన్‌గా నిలిచి తన సత్తా ఏంటో రెజ్లింగ్ ప్రపంచానికి చాటాడు. అక్కడి నుంచి మొదలైన దీపక్ రెజ్లింగ్ జైత్రయాత్ర.. నిన్నటి సిల్వర్ వరకు దేదీప్యమానంగా వెలుగుతోంది. జూనియర్ లెవల్‌లో ప్రత్యర్థులను తన ఉడుంపట్టుతో చిత్తు చేస్తూ.. తర్వాత జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సాధించాడు. దీంతో క్యాడెట్, జూనియర్ చాంపియన్‌షిప్ సాధించిన నాలుగో ఇండియన్ రెజ్లర్‌గా నిలిచిన దీపక్.. 18 ఏళ్ల తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన ఇండియన్ రెజ్లర్‌గా ఘనత సాధించాడు.
అండగా నిలిచిన తండ్రి
రెజ్లింగ్ వైపు దీపక్ పయనం చాలా ఆసక్తికరంగా సాగింది. ఒకరోజు వాళ్ల ఊరి సర్పంచ్‌తో పందెం కాసి నాలుగు కేటిళ్ల నిండా పాలు తాగి ఔరా అనిపించిన దీపక్.. ‘కేటిల్ పహిల్వాన్’గా పేరుపొందాడు. దీపక్ అంటే తండ్రికి వల్లమాలిన ప్రేమ. పూనియాకు పాలంటే ఎంతో ఇష్టమని తెలిసి 2015 నుంచి ప్రతిరోజు 60 కిలోమీటర్ల దూరంలోని ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి పాలు, ఫ్రూట్స్ అందించేవాడు. గతేడాది నయాబ్ సుబేదార్‌లాంటి జాబ్‌ను పొందినా కూడా సంతృప్తి ప్త పడక ‘మ్యాట్ దంగల్’ పేరుతో నిర్వహించే టోర్నీల్లో పాల్గొని పేరుతో పాటు ఆర్థికంగా కాస్త డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అతని కుటుంబ సమస్యలు తీర్చడంతోపాటు ఒక ఎస్‌యూవీని కూడా కొనుగోలు చేయడం అతని సక్సెస్‌ఫుల్ జర్నీకి చక్కని ఉదాహరణ.


