‘గ్లోబల్‌ లీడర్‌’ గా సుందర్‌ పిచాయ్‌

 ‘గ్లోబల్‌ లీడర్‌’ గా సుందర్‌ పిచాయ్‌

గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌‌ (46)కు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్‌‌ లీడర్‌‌ షిప్‌‌ అవార్డు 2019కు ఆయన్ను యూఎస్‌‌ ఇండియా బిజినెస్ అడ్వొకసీ గ్రూప్ (యూఎస్‌‌ఐబీసీ) ఎంపిక చేసింది. పిచాయ్‌‌తో పాటు నాస్డాక్‌‌ ప్రెసిడెంట్‌‌ ఎడెనా ఫ్రైడ్‌‌మన్‌‌(50) కూడా అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే వారం జరగనున్న ‘ఇండియా ఐడియాస్‌‌ సమ్మిట్‌‌’లో అవార్డును అందించనున్నారు. టెక్నాలజీ రంగం అభివృద్ధికి గూగుల్‌‌, నాస్‌‌డాక్‌‌ చేస్తున్న సేవలకు గాను వీరిని ఐబీసీ ఎంపిక చేసింది. ఇండియా, అమెరికాల్లో టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న, రెండు దేశాల అభివృద్ధికి ఊతమందిస్తున్న కార్పొరేట్‌‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌‌కు ఐబీసీ ఏటా ఈ అవార్డు ఇస్తుంటుంది. 2007 నుంచి అవార్డు ఇవ్వడం మొదలుపెట్టింది. ‘చిన్నతనంలో ఇండియాలో ఉన్నపుడు టెక్నాలజీ మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా  ఇంప్రూవ్‌‌ చేస్తుందో చూశాను. ఇండియా అభివృద్ధికి గూగుల్‌‌ ఊతమందిస్తుండటం నిజంగా గర్వంగా ఉంది. గూగుల్‌‌కు కావాల్సిన ఉత్పత్తుల తయారీలో ఇండియా కూడా ఎంతో సాయం చేస్తోంది’ అని పిచాయ్‌‌ అన్నారు.