మేకల మండీ.. కాంట్రాక్టర్​ తొండి!

మేకల మండీ.. కాంట్రాక్టర్​ తొండి!
  •     గడువు ముగిసినా టెండర్​డబ్బులు కట్టలే
  •     నోటీసులతో సరిపెట్టిన మున్సిపల్​ అధికారులు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని మేకల మండీని వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్ దానికి సంబంధించిన పైసలు కట్టలేదు. గడువు ముగిసినప్పటికీ అధికారులు తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వకపోతే టెండర్​ రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొని పది రోజులు గడిచినా ఎలాంటి చర్య లేదు. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు మేకల మండీ నిర్వహణకు మార్చి 16న వేలంపాట నిర్వహించారు. 

కాంట్రాక్టర్ బొంబోతుల శంకర్​రూ.22 లక్షలకు దక్కించుకున్నాడు. 18 శాతం జీఎస్టీ రూ.3.96 లక్షలతో కలిపి రూ.25.96 లక్షలు ఏప్రిల్ 30 లోగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.8 లక్షలు మాత్రమే చెల్లించాడు. దీంతో మిగతా డబ్బులు వెంటనే కట్టాలని మున్సిపల్​అధికారులు కాంట్రాక్టర్​కు ఈ నెల 3న నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే ఇప్పటివరకు చెల్లించిన రూ.8లక్షలను జప్తు చేయడంతో పాటు టెండర్​ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు కాంట్రాక్టర్​పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.