కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం ‘సేవ్ సింగరేణి ’ పేరుతో బస్సు జాతా చేపట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గని వద్ద బుధవారం ప్రారంభమైన జాత 13 రోజులు పాటు సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లోని బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్ల మీదుగా సాగనుంది. ఆర్కే-7 బొగ్గు గనిపై జాతను ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ ఎండి.యూసుఫ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించి మాట్లాడారు.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు కొసాగిస్తామని చెప్పారు. ‘సేవ్ సింగరేణి’ పేరుతో చేపట్టిన బస్సు జాతా ఈ నెల 29న కొత్తగూడెంలో ముగుస్తుందన్నారు. 30న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, కొత్త గనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో కార్మికుల హక్కులు అమలు కావడం లేదన్నారు. సింగరేణి హక్కుల సాధన కోసం వచ్చే నెలలో నిర్వహించే సమ్మెను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు రాజు కుమార్, శంకర్, బాజీ సైదా, వీరభద్రయ్య, సమ్మయ్య, కిషన్ పాల్గొన్నారు
