
- 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి
- 5.65 లక్షల ఎకరాల్లో కంది, 6 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు
- వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ ఖరారు
హైదరాబాద్, వెలుగు : వచ్చే వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో ప్రధాన పంటలు సాగు అయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ టార్గెట్గా పెట్టుకున్నది. ముఖ్యంగా వరి సాగుకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వానాకాలం సీజన్లో పంటల సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మొత్తం1,34,35,175 ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్ణయించింది.
66 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగేలా చూడాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అలాగే, పత్తి సాగు 60 లక్షల ఎకరాల్లో చేపట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత ప్రధాన పంటల్లో మక్కజొన్నలు 6 లక్షల ఎకరాల్లో వేయాలని ప్లాన్ చేసింది. వానాకాలం సీజన్లో కంది పంటకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. కంది పంట 5.65 లక్షల ఎకరాల్లో వేయాలని టార్గెట్ పెట్టుకుంది. పెసర్లు 56 వేల ఎకరాలు, మినుములు 20 వేల ఎకరాలు, సోయాబీన్ 4.96 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది.
ఆయిల్ సీడ్స్, చిరుధాన్యాలు తక్కువే..
వానాకాలం సీజన్లో ఆయిల్ సీడ్ పంటల్లో పల్లీ పంట (వేరుశనగ) కేవలం 23 వేల ఎకరాల్లోనే సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నువ్వులు 500 ఎకరాలు, పొద్దు తిరుగుడు 60 ఎకరాలు, కుసుమలు 3,500 ఎకరాల్లో సాగు కావచ్చని యోచిస్తోంది. అలాగే, చిరు ధాన్యాల పంటలు కూడా తక్కువగా సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తేల్చింది. జొన్నలు 38 వేల ఎకరాలు, సజ్జలు 1000 ఎకరాల్లోనే సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఖరీఫ్ పంటల యాక్షన్ ప్లాన్లో పేర్కొంది.