గాజాలో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో భాగంగా సుమారు 3,500 మంది సైనికులను గాజాకు పంపేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్లు సైనిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత గాజా పునర్నిర్మాణం, సరిహద్దుల భద్రత, మానవతా కారిడార్ల రక్షణ కోసం ట్రంప్ ఒక 20 పాయింట్ల శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ముస్లిం మెజారిటీ దేశాల సైన్యం గాజాలో శాంతి పరిరక్షక దళంగా ఉండాలని కోరారు. పాకిస్థాన్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుండటంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హర్షం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ త్వరలోనే వాషింగ్టన్ వెళ్లనున్నారు. ఆరు నెలల కాలంలో ట్రంప్‌తో ఆయనకు ఇది మూడవ భేటీ కానుంది. ఈ పర్యటనలో గాజాకు సైన్యాన్ని పంపే అంశంపైనే ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాత్రం దీనిపై ఇంకా తటస్థంగానే ఉంది. తాము ఇంకా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, ఎటువంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని పాక్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ ఆండ్రబీ పేర్కొన్నారు.
ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు దౌత్యపరంగా మేలు చేసినప్పటికీ, దేశీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా.. గాజాలో శాంతి భద్రతల బాధ్యత తీసుకుంటాం కానీ, హమాస్‌ను నిరాయుధులను చేయడం తమ పని కాదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న లేదా పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని ఈ మిషన్‌లో చేరడంపై పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులు నిరసన వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన పట్టాలెక్కితే, పశ్చిమాసియా భద్రతలో పాకిస్థాన్ నేరుగా పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది అమెరికా-పాక్ సంబంధాలను బలపరచడమే కాకుండా.. అంతర్జాతీయంగా పాక్ ప్రాముఖ్యతను పెంచుతుంది.
