ఆయుర్వేదంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు

ఆయుర్వేదంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు

ఎన్‌‌సీఐఎస్‌‌ఎం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్​ సిస్టమ్‌‌గా పేరుగాంచిన ఆయుర్వేదంలో సూపర్‌‌‌‌ స్పెషాలిటీ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌‌(ఎన్‌‌సీఐఎస్‌‌ఎం) ప్రకటించింది.  కోర్సులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ మంగళవారం ఎన్‌‌సీఐఎస్‌‌ఎం ఉత్తర్వులు జారీ చేసింది. విశిష్ట చికిత్స(డీఎం ఆయుర్వేది) పేరిట ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంది. డీఎం మానసరోగ(సైకియాట్రి), డీఎం వజీకరణ(రిప్రొడక్టివ్ మెడిసిన్), డీఎం అస్థి అండ్ సంధి(ఆర్థోపెడిక్స్‌‌), డీఎం కౌమార పంచకర్మ(పీడియాట్రిక్స్‌‌) కోర్సులను ప్రవేశపెడుతున్నామని ఎన్‌‌సీఐఎస్‌‌ఎం వెల్లడించింది. 

డీఎం కోర్సులు చేసేందుకు సంబంధిత సబ్జెక్టులలో ఎండీ ఆయుర్వేద కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు అర్హులుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుర్ ఆంకాలజీ, ప్రివెంటీవ్ కార్డియాలజీ, లైఫ్‌‌స్టైల్ మేనేజ్‌‌మెంట్, ఆయుర్‌‌‌‌ డెర్మటాలజీ, ఆయుర్ స్పోర్ట్స్‌‌మెడిసిన్‌‌, మర్మ చికిత్స పేరిట ఫెలోషిప్ ప్రోగ్రామ్స్‌‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఎన్‌‌సీఐఎస్‌‌ఎం తెలిపింది.  ఈ కోర్సులను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న కాలేజీలు తమకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.