Shakib Al Hasan: షకీబ్ క్రూరత్వం.. సెల్ఫీ అడిగితే మెడ పట్టి గెంటేశాడు

Shakib Al Hasan: షకీబ్ క్రూరత్వం.. సెల్ఫీ అడిగితే మెడ పట్టి గెంటేశాడు

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ ఆల్ రౌండర్ కు కోపం వస్తే ఏం చేస్తాడో అతనికే తెలియదు. కెప్టెన్ గా ఎంతో హుందాగా నడుచుకోవాల్సిన ఇతను ఇతరులపై దౌర్జన్యం చేస్తూ పలు సార్లు దొరికిపోయాడు. గ్రౌండ్ లో సహచర క్రికెటర్లపై, అంపైర్లపై దురుసుగా వ్యవహరించి తీవ్ర విమర్శలకు కారణమయ్యాడు. కొద్ది రోజుల క్రితం.. ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో పార్లమెంటరీ సీటును గెలుచుకున్న షకీబ్.. మగురాలో జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఒక అభిమానిని చెంపదెబ్బ కొట్టాడు.

ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా తాజాగా మరొకసారి ఇలాంటి ఘటనే జరిగింది. షేక్ జమాల్ ధన్మొండి క్లబ్ తరపున షకీబ్ ఆడుతున్నాడు. ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌పై మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. టాస్‌కు ముందు ఈ బంగ్లా ఆల్ రౌండర్ అభిమానిని తీవ్రంగా నిరాశపరిచాడు. షకీబ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఫ్యాన్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ దశలో గ్రౌండ్ బయటకు వెళ్లాలని షకీబ్ కోరాడు. అయితే అతను మాత్రం సెల్ఫీ ఇవ్వాల్సిందిగా బ్రతిమిలాడాడు. దీంతో షార్ట్ టెంపర్ తో షకీబ్.. ఆ అభిమానిని ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిచాడు. ఆ కుర్రాడు ఫోన్ ఇవ్వకపోవడంతో మెడ పట్టుకొని వెనక్కి తోశాడు. 

ఈ సమయంలో ఫ్యాన్ షకీబ్ ను క్షమాపణలు కోరుతున్నా బయటకు వెళ్లాలని అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ గా ఉంటున్న షకీబ్.. జూన్ లో వెస్టిండీస్, ఆమెరికా వేదికగా జరగబోయే   టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తున్నాయి.