- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: కులగణనపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని విద్యానగర్ బీసీ భవన్లో మోడీ రాందేవ్, రఘుపతి అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన విధానపరమైన అంశమని, ఇందులో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు.
వెనకబడిన వర్గాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటే కులాల వారీగా వివరాలు అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించిందని, మొదటి దశలో ఇండ్ల లెక్కింపు, రెండో దశలో కులగణన చేపడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, నాయకులు నిఖిల్ పటేల్, బాలయ్య, సాయిబాబా పాల్గొన్నారు.
పేదలకే స్థలాలు ఇవ్వాలి
మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు : ప్రభుత్వ స్థలాలను ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి తప్ప, వాటిని వేలం వేసి విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని కృష్ణయ్య అన్నారు. ఘట్కేసర్ మండలం కాచువాని సింగారంలో గతంలో పట్టాలు ఇచ్చిన 1,500 మంది పేదలకు వెంటనే స్థలాల పొజిషన్ ఇవ్వాలని, ప్రభుత్వ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వందలాది మంది ప్రజలు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో కృష్ణయ్య మాట్లాడుతూ.. కొందరు రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై పేదల భూములను దోచుకుంటున్నారని, దీనిపై త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి సీబీఐ విచారణ కోరతామని హెచ్చరించారు.
