Veerabhadrudu: ఫ్యాన్స్ వెయిటింగ్‌ ఓవర్.. ఎట్టకేలకు థియేటర్లలోకి సూర్య మూవీ.. ఆలస్యంపై మేకర్స్ క్షమాపణలు

Veerabhadrudu: ఫ్యాన్స్ వెయిటింగ్‌ ఓవర్.. ఎట్టకేలకు థియేటర్లలోకి సూర్య మూవీ.. ఆలస్యంపై మేకర్స్ క్షమాపణలు

టాప్ స్టార్స్ సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్-డ్రామా మూవీ ‘కరుప్పు’ (Karuppu). తెలుగులో ‘వీరభద్రుడు’. డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ రూపొందించిన ఈ భారీ కోలీవుడ్ ప్రాజెక్ట్, 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాల్లో ఒకటి. గురువారం మే 14న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడి అభిమానులకి షాక్ ఇచ్చింది. చివరికి అన్నీ అడ్డంకులు దాటుకుని శుక్రవారం మే 15న థియేటర్లలో విడుదలై సూర్య ఫ్యాన్స్లో ఉత్సాహం నింపింది. దాదాపు 24 గంటల ఆలస్యానంతరం, ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్లు పెద్ద సినిమాతో కళకలాడుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ, ఆలస్యానికి క్షమాపణలు తెలిపింది. అభిమానుల ప్రేమ, మద్దతే ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చిందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీరభద్రుడి విజృంభజనం చూసేయండి అని ట్వీట్ చేసింది. 

“ ఈ నిరీక్షణ ఎంత బాధాకరమో మాకు తెలుసు. కొన్ని ప్రయాణాలు కాలాన్ని మాత్రమే కాదు, మన హృదయాలను కూడా పరీక్షిస్తాయి. ‘కరుప్పు’ కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ప్రతి ఆలస్యం మాపై కూడా ఎంతో భారాన్ని మోపింది. కానీ ఎదురైన ప్రతి అడ్డంకిలోనూ మీరు మా వెన్నంటే ఉన్నారు.

ఆలస్యం అవ్వడం వల్ల బాధపడ్డ ప్రతిఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాము. అంతకంటే ముఖ్యంగా, ఇలాంటి క్లిష్ట సమయంలో మీరు ఇచ్చిన మద్దతు, అంతులేని ప్రేమకు కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నాము. ఇవాళ కరుప్పు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.. చూసి ఎంజాయ్ చేయండి” అని నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

ఫైనాన్షియల్ షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు

సూర్య, త్రిష నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) మే 14న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా షోలు రద్దయ్యాయి. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రదర్శనలు నిలిచిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినప్పటికీ, దాదాపు రూ.10 కోట్ల బకాయిల కారణంగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఆలస్యం అయినట్లు సమాచారం. పాత సినిమాల తాలూకు బకాయిలు కూడా తోడవడంతో ఫైనాన్షియర్లు క్లియరెన్స్ ఇవ్వలేదు.

ఈ పరిణామాలపై దర్శకుడు ఆర్‌జే బాలాజీ భావోద్వేగానికి గురై అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు హీరో ధనుష్ కూడా సినిమా త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. ఇక ఎట్టకేలకు విషయం సద్దుమణగడంతో, ‘కరుప్పు’ థియేటర్లోకి వచ్చింది.