'విశ్వనాథ్ & సన్స్' టీజర్ రిలీజ్.. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో వస్తున్న సూర్య, మమితా!

 'విశ్వనాథ్ & సన్స్' టీజర్ రిలీజ్.. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీతో వస్తున్న సూర్య, మమితా!

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో తమిళ స్టార్ హీరో సూర్య  ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరితో జతకట్టారు. 'లక్కీ భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ప్యూర్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath & Sons).  లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

 ప్రొఫెషనల్ షూటర్ గా సూర్య

ఈ చిత్రంలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అలియాస్ 'మ్యాడీ' అనే ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక పరిణతి చెందిన వ్యక్తిగా సూర్య తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఒక యువతి (మమితా బైజు) ఆయన జీవితంలోకి ప్రవేశించి, ఆయన్ని అమితంగా ప్రేమిస్తుంది. తన కంటే వయసులో చాలా చిన్నదైన ఆ అమ్మాయి ప్రేమను మ్యాడీ నిరాకరిస్తూ ఉంటాడు. వీరి మధ్య ఉన్న 'ఏజ్ గ్యాప్' వల్ల వచ్చే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి చాలా అందంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

భారీ తారాగణం.. 

'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంతో మరింత గుర్తింపు పొందేలా కనిపిస్తోంది. సూర్య వంటి దిగ్గజ నటుడి సరసన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. వీరితో పాటు సీనియర్ నటీమణులు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత వెయిట్ ఇచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.

 విడుదల ఎప్పుడంటే?

ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతున్న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ,'ధురందర్ 2' సినిమాలతో పాటు ఈ టీజర్‌ను అటాచ్ చేశారు. దీంతో అభిమానుల సందడి రెట్టింపు అయింది. ఈ చిత్రాన్ని జూలై 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  సూర్య గతంలో ఎన్నడూ చేయని విధంగా చాలా కూల్ అండ్ క్లాసీ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ 'విశ్వనాథ్ & సన్స్' చిత్రాన్ని జూలై 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.