
బీసీలను కించపరిస్తే బుద్ధి చెప్తాం: తలసాని
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
ఆత్మగౌరవం వదులుకోం: గంగుల
మంత్రి గంగులపై ఇటీవల రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
వాటిని నిరసిస్తూ బీఆర్ఎస్ బీసీ నేతల మండిపాటు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీపై బీసీ అస్త్రం ప్రయోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై బీఆర్ఎస్లోని బీసీ నేతలంతా ఐక్యతారాగం అందుకున్నారు. బుధవారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కమలాకర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు సమావేశయ్యారు. బీసీలను కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోరుబాటకు రెడీ అయ్యారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉచిత కరెంట్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను అడ్వాంటేజ్‌గా తీసుకున్న బీఆర్ఎస్ఊరూరా ఉచిత కరెంట్‌కు కాంగ్రెస్వ్యతిరేకం అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు బీసీలకు కూడా హస్తం పార్టీ వ్యతిరేకం అని చెప్పడానికి రెడీ అయ్యింది. మంత్రి గంగులను బాడీ షేమింగ్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మంత్రులు, ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
క్షమాపణ చెప్పేవరకు వదలం: శ్రీనివాస్ గౌడ్
బీసీ కులాలు, నాయకులు, ప్రజాప్రతినిధుల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలు ఆత్మగౌరవంతో ముందుకెళ్తుంటే కొందరు ఆక్రోశం వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. బీసీ కులాల్లో పంచాయితీ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. బీసీల కులాల వారీగా సమావేశాలు పెట్టి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తమను కించపరుస్తున్న నేతలు ముక్కుచెంపలు వేసుకొని క్షమాపణ చెప్తే తప్ప వదలబోమన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.
ప్రాణాలైనా అర్పిస్తాం: గంగుల
ప్రాణాలైన అర్పిస్తాం గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోబోమని మంత్రి గంగుల కమలాకర్అన్నారు. తాము బానిసలం కాదని.. చైతన్యవంతులమన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక సమానత్వం కల్పించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బీసీ వర్గాలను, కులాల నేతలను తిట్టడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్నేతల్లా తాము ఇతర పార్టీల నేతలను దూషిస్తూ మాట్లాడబోమన్నారు. ఆర్ఎస్ఎస్లో పని చేసిన రేవంత్‌రెడ్డి.. మొదటి నుంచి బీసీ, రైతు వ్యతిరేకి అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సమావేశంలో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బీబీ పాటిల్, మాజీ స్పీకర్మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శంభీపూర్‌రాజు, యెగ్గె మల్లేశం, ఎల్.రమణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గంప గోవర్ధన్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, నాయకులు చింత ప్రభాకర్, దాసోజు శ్రవణ్, తలసాని సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నడు: తలసాని
బీసీ ప్రజాప్రతినిధులను, నాయకులను కించపరిచేలా విమర్శలు చేస్తే బుద్ధి చెప్తామని మంత్రి తలసాని హెచ్చరించారు. బీసీలు నాయకులుగా ఎదగడం చూసి ఓర్వలేకనే రేవంత్ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ రూ. వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బీసీలు తలెత్తుకునేలా కోట్లాది రూపాయల విలువైన భూములు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నంత కాలం బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. బీసీల జోలికొస్తే కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. నోటికొచ్చినట్టుగా తిట్టడం, కుల వృత్తు లను కించపరిచేలా మాట్లాడటం రేవంత్ వ్యక్తిగతమా.. కాంగ్రెస్ పార్టీ విధానమా? అనేది చెప్పాలన్నారు. బీసీలను అణచివేసేందుకు, బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. తమ జోలికి వస్తే మూకుమ్మడిగా దాడి చేస్తామని హెచ్చరించారు.