తమిళనాడు మంత్రులకు శాఖలు కేటాయింపు.. హోం విజయ్ వద్దే.. ఆర్థిక శాఖ ఎవరికి ఇచ్చారంటే..?

తమిళనాడు మంత్రులకు శాఖలు కేటాయింపు.. హోం విజయ్ వద్దే.. ఆర్థిక శాఖ ఎవరికి ఇచ్చారంటే..?

చెన్నై: సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన మంత్రులకు శాఖలు కేటాయించింది. శనివారం (మే 16) సీఎం విజయ్ తన కేబినెట్‎లోని సహచర మంత్రులకు పోర్ట్‎ఫోలియోలు అలాట్ చేశారు. కీలకమైన హోం శాఖను విజయ్ తన దగ్గరే ఉంచుకున్నారు. అలాగే, ప్రజా, సాధారణ పరిపాలన, పోలీస్, మహిళా, యువజన సంక్షేమ శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు.

విజయ్‌కు సన్నిహితుడైన 78 ఏళ్ల కేఏ సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. కేజీ అరుణ్‌రాజ్‎కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను కేటాయించారు. ఎన్ ఆనంద్‌ను గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా నియమించారు. ఆదవ్ అర్జునకు ప్రజా పనులు, క్రీడలు, అభివృద్ధి శాఖలను కేటాయించగా.. పి. వెంకటరమణన్‌కు ఆహారం, పౌర సరఫరాల శాఖను అలాట్ చేశారు. 

ఆర్. నిర్మల్‌కుమార్ ఇంధన, న్యాయ శాఖలను చేపట్టనుండగా.. రాజ్‌మోహన్‌ను పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నియమించారు. టి.కె. ప్రభుకు సహజ వనరుల శాఖ అప్పగించగా.. యువ మహిళా మంత్రి ఎస్. కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. ఈ మేరకు శనివారం (మే 16) లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది. 

కాగా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 108 సీట్లలో గెలుపొంది అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) లేకపోవడంతో కాంగ్రెస్, అన్నాడీఎంకే రెబర్ వర్గాల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.