జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ రంజన్ హత్య, దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. మే 8న జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో ఈ దారుణానికి ఒడిగట్టిన నేపాలీ గ్యాంగ్.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బంగారం, నగదుతో నగరం నుంచి పరారయ్యారు. నిందితులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి పారిపోగా, ప్రధాన సూత్రధారి కల్పన ఇండియాలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుల వద్ద మొబైల్ ఫోన్లు లేకపోవడంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలను ముంబైలో కొనుగోలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా కేసులో కీలక పురోగతి లభించే అవకాశం ఉంది. నగర పోలీస్ కమిషనర్ ప్రతిరోజు అధికారులతో సమీక్షిస్తూ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
