తార్నాక ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ఎట్టకేలకు ఓపెన్

తార్నాక ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ఎట్టకేలకు ఓపెన్

సికింద్రాబాద్, వెలుగు: ఏడు నెలల కిందట నిర్మాణం పూర్తయిన తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలోని ఫుట్ఓవర్ బ్రిడ్జి ఎట్టకేలకు జనానికి అందుబాటులోకి వచ్చింది. ఓపెనింగ్ కు అంతా రెడీ చేశాక నేతల ప్రొటోకాల్​వివాదంతో బ్రిడ్జి ఓపెనింగ్​ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడగా, శుక్రవారం మూడోసారి పెట్టిన ముహూర్తానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తార్నాక – లాలాపేట రోడ్డు రద్దీగా మారిందని, సెయింట్​ఆన్స్​స్కూల్ స్టూడెంట్లతోపాటు స్థానికులు రోడ్డు దాటేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.2.60 కోట్లతో ఫుట్​ఓవర్​బ్రిడ్జి నిర్మించామని చెప్పారు.

ఆలుగడ్డ బావి, తార్నాక సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌజ్ ఏరియాల్లోనూ ఫుట్​ఓవర్​బ్రిడ్జిలు నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు గుర్తుచేశారు. చిలకలగూడ క్రాస్ రోడ్స్ వద్ద స్కై వాక్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత, సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి, కంది శైలజ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఈఈ ఆశలత పాల్గొన్నారు.

పికెట్ నాలా బ్రిడ్జి ప్రారంభం

మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై రూ.20 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిటీలో ముంపు సమస్య లేకుండా చేసేందుకు ఎస్ఎన్డీపీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పికెట్ నాలాపై కరాచీ బేకరీ వద్ద రూ.10 కోట్లతో, మినిస్టర్ రోడ్డులోని పికెట్ నాలాపై బ్రిడ్జిలు నిర్మించామని చెప్పారు. ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్ సాగర్ నాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.