V6 News

మిస్త్రీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన టాటా సన్స్

మిస్త్రీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన టాటా సన్స్
  • ఎన్‌‌సీలాట్ తీర్పుపై సుప్రీంలో సవాల్
  • ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని వినతి

న్యూఢిల్లీ :   సైరస్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌గా తిరిగి నియమించాలంటూ ఎన్‌‌సీలాట్ ఇచ్చిన తీర్పుపై టాటా సన్స్, సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్‌‌సీలాట్ గత నెల 18న ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. టాటా సన్స్‌‌ హెడ్‌‌గా ఎన్‌‌.చంద్రశేఖరన్ నియామకం చట్ట విరుద్ధం అంటూ నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్(ఎన్‌‌సీలాట్) ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం తెలిపింది. అంతేకాక సైరస్ మిస్త్రీని మళ్లీ నియమించుకోవాలంటూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని కూడా సుప్రీంకోర్టును టాటా గ్రూప్ అభ్యర్థించింది. కాగా, టాటా గ్రూప్ – మిస్త్రీ వివాదంలో, సైరస్ మిస్త్రీ వైపుకే మొగ్గుచూపుతూ ఆయన్ని మళ్లీ నియమించుకోవాలని ఎన్‌‌సీలాట్ గత నెల ఆదేశించింది. ఈ జడ్జిమెంట్‌‌పై ఏమైనా అభ్యంతరాలుంటే నాలుగు వారాల్లో టాటాలు అప్పీల్‌‌కు వెళ్లాలని సూచించింది. అదేవిధంగా టాటా సన్స్‌‌ను పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడాన్ని కూడా ఎన్‌‌సీలాట్ ఒప్పుకోలేదు. మిస్త్రీకి వ్యతిరేకంగా టాటా సన్స్‌‌ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది. టాటా సన్స్‌‌లో మిస్త్రీ ఫ్యామిలీకి 18 శాతం వాటాలున్నాయి.  షాపూర్జీ పల్లోంజి ఫ్యామిలీకి చెందిన మిస్త్రీ, టాటా సన్స్‌‌కు రతన్‌‌ టాటా తర్వాత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. అంటే టాటా గ్రూప్‌‌కు చెందిన అన్ని లిస్టెడ్ కంపెనీలకు ఆయననే హెడ్. అయితే హఠాత్తుగా టాటా సన్స్ ఛైర్మన్‌‌గా మిస్త్రీని టాటా గ్రూప్ తొలగించింది. 2016 అక్టోబర్‌‌‌‌న వెలువడిన ఈ నిర్ణయం కార్పొరేట్ రంగంలోనే కలకలం సృష్టించింది. టాటా గ్రూప్ సీనియర్ మేనేజ్‌‌మెంట్ అంతా కూడా రతన్‌‌ టాటా, ఆయన తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఆయనను అలా హఠాత్తుగా తొలగించడంపై మిస్త్రీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌‌సీఎల్‌‌టీ) ముంబై బెంచ్‌‌కు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ టాటాలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ మిస్త్రీ తన ఫిర్యాదును ఎన్‌‌సీలాట్‌‌లో దాఖలు చేశారు. ఇలా మూడేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ కేసులో, గత నెల మిస్త్రీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఆర్‌‌‌‌ఓసీ ఫిర్యాదు విచారణ వాయిదా…

మిస్త్రీని మళ్లీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌‌గా తీసుకోవాలంటూ ఇచ్చిన తీర్పులో మార్పులు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌‌(ఆర్‌‌‌‌ఓసీ), ఎన్‌‌సీలాట్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ ఫిర్యాదు విచారణను ఎన్‌‌సీలాట్ శుక్రవారం వరకు వాయిదా వేసింది. కంపెనీస్ యాక్ట్ రూల్స్  కింద ప్రైవేట్, పబ్లిక్ కంపెనీల అర్థాన్ని తెలుపాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఛైర్మన్ జస్టిస్ ఎస్‌‌జే ముఖోపాధ్యాయతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ ఆదేశించింది. అదేవిధంగా పెయిడప్ క్యాపిటల్ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌పై కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పింది.

Tata Sons moves SC challenging NCLAT decision restoring Cyrus Mistry as executive chairman