2026 సంవత్సరం టెక్ ఉద్యోగులకు ఒక పీడకలగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా సాగిన నియామకాల జోరుకు బ్రేకులు పడటమే కాకుండా.. కంపెనీలు భారీగా కోతలకు దిగుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే అంటే జస్ట్ 90 రోజుల్లో 95 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 73వేల 200 మంది ఉద్యోగులను పీకేశాయి. కేవలం రెండు వారాల్లోనే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా, డిస్నీ, స్నాప్, ఒరాకిల్ లాంటి దిగ్గజాలు వరుసగా లేఆఫ్స్ ప్రకటించడం టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
ఇండియాపై తీవ్ర ప్రభావం..
ఈ లేఆఫ్స్ సీజన్‌లో అత్యంత పెద్ద దెబ్బ ఒరాకిల్ నుండే తగిలింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20వేల నుండి 30వేల మంది ఉద్యోగాలను తొలగించాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందులో దురదృష్టవశాత్తు భారత్‌పై ప్రభావం ఎక్కువగానే ఉంది. దాదాపు 12వేల మంది భారతీయ టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు అంచనా. క్లౌడ్, హెల్త్‌కేర్, సేల్స్ విభాగాల్లో లేఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి.
AI రాకతో స్నాప్, మెటా మార్పులు..
సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఇంక్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ లేఆఫ్స్‌కు AI ప్రధాన కారణమని సీఈఓ ఇవాన్ స్పీగల్ స్పష్టం చేశారు. AI తో పనులు వేగంగా, ఆటోమేటిక్ గా జరుగుతుండటంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోందని పేర్కొన్నారు. మరోవైపు మెటా కూడా వరుసగా కోతలు విధిస్తోంది. రియాలిటీ ల్యాబ్స్, సేల్స్ విభాగాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించి.. కంపెనీని స్ట్రీమ్ లైన్ చేస్తోంది.
డిస్నీలో కొత్త నాయకత్వం.. కొత్త నిర్ణయాలు
వాల్ట్ డిస్నీ కంపెనీలో కొత్త సీఈఓ జోష్ డి అమారో బాధ్యతలు చేపట్టిన వెంటనే సుమారు 1,000 మందిని తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. పదవి, సర్వీస్ ఆధారంగా ఉద్యోగులకు 4 వారాల నుండి 52 వారాల వరకు సెవెరెన్స్ పే అందిస్తున్నారు. డైరెక్టర్ స్థాయి వారికి 26 వారాల వరకు భారీ ప్యాకేజీలు లభించనున్నాయి.
మొత్తానికి 2026లో లేఆఫ్స్ కేవలం ఖర్చు తగ్గించుకోవడానికే కాదు.. AI, ఆటోమేషన్ వైపు కంపెనీలు వేగంగా మారుతున్నాయనడానికి సంకేతం. అనవసరమైన రోల్స్ తొలగించి, భవిష్యత్తు టెక్నాలజీపై పెట్టుబడి పెట్టడమే ఈ కంపెనీల అసలు వ్యూహం. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

