- మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
- స్నేహితుడితో టెంపోలో వెళ్లిన 16 ఏండ్ల బాలిక
- మరో ముగ్గురితో కలిసి యువకుడి లైంగికదాడి
- బాలికను కత్తితో పొడిచి దారుణ హత్య
- ఆపై డెడ్ బాడీని గ్రౌండ్ లో పడేసి పరార్
- 50కి పైగా సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీ
- నలుగురిపై బీఎన్ఎస్, పోక్సో కింద కేసు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్నేహితుడిని నమ్మి వెళ్లిన ఓ అమాయక బాలిక కామాంధుల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. 16 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి, అత్యంత పాశవికంగా ఎనిమిది సార్లు కత్తులతో పొడిచి చంపి బహిరంగ ప్రదేశంలో పడేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం కలకలం రేపింది. ఔటర్ ఢిల్లీలోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఒక 19 ఏండ్ల యువకుడితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న సదరు బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. అయితే, అతను పథకం ప్రకారం మరో ముగ్గురు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వారిలో ఒకరి సోదరుడికి చెందిన సరుకుల రవాణా టెంపోలో ఆమెను ఎక్కించుకున్నారు. నలుగురూ మద్యం మత్తులో ఉన్నట్టు విచారణలో తేలింది. కదులుతున్న టెంపోలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో.. అత్యంత కిరాతకంగా ఆమె శరీరంపై కత్తులతో 8 సార్లు పొడిచి ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాన్ని కుశక్ రోడ్డు సమీపంలోని ఖాళీ మైదానంలో పడేసి పారిపోయారు. 13న ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో డెడ్‌బాడీ కనిపించింది. ఒక చేయి శరీరం నుంచి వేరుపడిందని.. శరీరభాగాలను కుక్కలు పీక్కుతిన్నట్టు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. బాధితురాలు తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజులకు తిరిగి వస్తుండటంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయలేదు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..
సంఘటనా స్థలంలో ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోవడంతో డీసీపీ శోభిత్ డి సక్సేనా పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పరిసర ప్రాంతాల్లోని 50కి పైగా సీసీటీవీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలించారు. చీకటిలో అనుమానాస్పదంగా తిరిగిన టెంపోను గుర్తించిన పోలీసులు.. అనేక మార్గాల్లోని ఫుటేజీలను అనుసంధానిస్తూ వెహికల్ నంబర్‌ను, రూట్‌ను ఛేదించారు.
