త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్..ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు అంచెల ఫార్ములా!

త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్..ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు అంచెల ఫార్ములా!
  • కేశవరావు నేతృత్వంలో కమిటీ తొలి భేటీ.. సీఎంకు ధన్యవాదాలు
  • అమరవీరుల జ్యోతి కింద కమిటీ ఆఫీస్
  • కేసుల నుంచి పేపర్ కటింగ్స్ వరకు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం
  • ఒకటి రెండు రోజుల్లో సీఎంతో సమావేశమై విధివిధానాలపై ప్రకటన

హైదరాబాద్, వెలుగు:  మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ వేదికగా సాగిన పోరాటంలో పాల్గొన్న సబ్బండ వర్గాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. రాజకీయాలకు అతీతంగా.. ఏ ఒక్క ఉద్యమకారుడికీ అన్యాయం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ శనివారం చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి హాజరయ్యారు. అమరవీరుల స్మారక జ్యోతి కిందనే కమిటీ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

రాజకీయాలకు అతీతంగా ఎంపిక..

అర్హుల ఎంపిక కోసం కమిటీ నాలుగు రకాల ప్రాధాన్యతా విధానాన్ని ప్రతిపాదించింది. మొదటి కేటగిరీలో ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు, రెండో కేటగిరీలో గాయపడిన బాధితులకు స్థానం కల్పించనున్నారు. మూడో కేటగిరీలో జైలుకు వెళ్లినవారు, అరెస్ట్ అయి కేసులు ఎదుర్కొన్న వారిని చేర్చగా, నాలుగో కేటగిరీ కింద క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పౌర సమాజ నేతలను గుర్తించనున్నారు.

గత ప్రభుత్వంలో కేవలం కొంతమందికే ప్రయోజనం చేకూరిందన్న విమర్శలను ప్రస్తావిస్తూ..  ఈసారి పార్టీలతో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేస్తామని కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన నుంచి రాగానే, కమిటీ ప్రతిపాదించిన విధివిధానాలపై ఆయన సమక్షంలో చర్చించి తదుపరి అడుగులు వేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లేందుకు జిల్లా పర్యటనలకు రూట్‌మ్యాప్ రూపొందించింది.

ఇందులో భాగంగా 1969, 1972, 1996 నాటి ఉద్యమకారులతో పాటు తెలంగాణ ఉద్యమ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, కళాకారులు, న్యాయవాదులు, కుల సంఘాలు, వివిధ జిల్లాల్లోని పౌర సమాజ ప్రతినిధుల నుంచి విస్తృతంగా ప్రతిపాదనలు సేకరించాలని నిర్ణయించింది.  ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో (ఆల్ పార్టీ) ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అధికారిక కమిటీని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.