ఉద్యమకారులను గుర్తించి త్వరగా నివేదిక అందజేస్తాం : కె. కేశవరావు

ఉద్యమకారులను గుర్తించి త్వరగా నివేదిక అందజేస్తాం : కె. కేశవరావు
  • తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు
  • 16 రోజులపాటు వివిధ సంఘాలతో చర్చించాం: ప్రొ. కోదండరామ్​
  • త్వరలో జిల్లాల్లో పర్యటించి సమావేశాలు పెడతాం: ఎమ్మెల్సీ అద్దంకి

హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16 రోజులపాటు వివిధ సంఘాలతో చర్చించామని పేర్కొన్నారు. "ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి.. ఎలా గౌరవించాలి?" అనే అంశంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని తెలిపారు. సంఘాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలకు దాదాపు 13 వేల మంది హాజరయ్యారని, వారిలో సుమారు వెయ్యి మంది సూచనలు చేశారని చెప్పారు. వీటిపై ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కూడా అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే తేదీలను ప్రకటించి ఉద్యమకారులు, సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కేలా కమిటీ పనిచేస్తుందని చెప్పారు. 16 రోజులపాటు వివిధ సంఘాలతో ప్రశాంత వాతావరణంలో సమావేశాలు నిర్వహించామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఉద్యమకారుల మాటలు విని పాత రోజులు గుర్తుకురావడంతో తాము భావోద్వేగానికి గురయ్యామని చెప్పారు. త్వరలో వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారులు, సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.

దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. నాటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహిస్తామని వివరించారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోపే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.