సోలార్ ప్లాంట్ల కోసం రూ.66.50 కోట్లు

సోలార్ ప్లాంట్ల కోసం రూ.66.50 కోట్లు
  • ఆదిలాబాద్​ జిల్లా కజ్జర్ల వద్ద 4 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు 
  • ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా 73.25 ఎకరాలు గుర్తింపు 

హైదరాబాద్, వెలుగు: గ్రీన్​ఎనర్జీని పెంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా18 చోట్ల 19 మెగావాట్ల సోలార్​ పవర్​ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి రూ.66.50 కోట్లు కేటాయించినట్టు విద్యుత్​శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శనివారం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 73.25 ఎకరాల సర్కారు భూమిని గుర్తించగా తొలుత పైలట్ ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్​ జిల్లా కజ్జర్లలో 4 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్టు ఆయన తెలిపారు.

ఇందుకు సంబంధించి జీవో 11ను విడుదల చేశారు. 2029-–30 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని నవీన్​ మిట్టల్​ పేర్కొన్నారు. దక్షిణ డిస్కమ్  పరిధిలో 8, ఉత్తర డిస్కమ్​ పరిధిలో 11 మెగావాట్ల సోలార్​పవర్​ ప్లాంట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. కజ్జర్లలో సౌర విద్యుత్ ప్లాంట్ పైలట్ ప్రాజెక్ట్​ ఏర్పాటుకు టీజీ రెడ్​కో సంస్థ నోడల్​ ఏజెన్సీగా వ్యవహరించనుందని వెల్లడించారు. సదరు సంస్థ ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుంటుందని తెలిపారు.