నేషనల్‌‌ గేమ్స్‌‌లో తెలంగాణ అథ్లెట్ల పతకాల జోరు

నేషనల్‌‌ గేమ్స్‌‌లో తెలంగాణ అథ్లెట్ల పతకాల జోరు

అహ్మదాబాద్‌‌‌‌: నేషనల్‌‌ గేమ్స్‌‌లో తెలంగాణ అథ్లెట్ల పతకాల జోరు కొనసాగుతోంది. సోమవారం జరిగిన బ్మాడ్మింటన్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళపై గెలిచి గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిసింది. తొలి సింగిల్స్‌‌లో సాయి ప్రణీత్‌‌ 18–21, 21–16, 22–20తో హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ను చిత్తు చేశాడు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో సుమిత్‌‌ రెడ్డి–సిక్కి రెడ్డి 21–15, 14–21, 21–14తో ఎంఆర్‌‌ అర్జున్‌‌–ట్రిసా జోలీపై గెలిచారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో సామియా ఫారూఖీ 21–5, 21–12తో టీఆర్‌‌ గౌరి కృష్ణపై గెలిచి తెలంగాణకు మెడల్‌‌ను సాధించిపెట్టింది. విమెన్స్‌‌ 3X3 బాస్కెట్‌‌ బాల్‌‌లోనూ తెలంగాణ గోల్డ్‌‌ మెడల్‌‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తెలంగాణ 17–13తో కేరళను ఓడించి టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. స్విమ్మింగ్‌‌ 800 ఫ్రీస్టయిల్‌‌లో తెలంగాణ స్విమ్మర్‌‌ వ్రితి అగర్వాల్‌‌ సిల్వర్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌‌ రేస్‌‌ను వ్రితి 9.23 సెకన్లలో ముగించి రెండో ప్లేస్‌‌లో నిలిచింది. భవ్య సచ్‌‌దేవ్‌‌ (ఢిల్లీ) 9.15 సెకన్లతో గోల్డ్‌‌, అష్మిత్‌‌ చంద్ర (కర్ణాటక) 9.27 సెకన్లతో బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ను గెలుచుకున్నారు. రోయింగ్‌‌ ఈవెంట్‌‌లోనూ తెలంగాణ టీమ్‌‌కు బ్రాంజ్‌‌ మెడల్‌‌ లభించింది. ఎం8 ఫైనల్లో తెలంగాణ 5:46.39 సెకన్ల టైమింగ్‌‌తో మూడో ప్లేస్‌‌ను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌‌ 5:52.57 సెకన్లతో నాలుగో ప్లేస్‌‌లో నిలిచింది. సర్వీసెస్‌‌ (5:32.88 సెకన్లు), మధ్యప్రదేశ్‌‌ (5:46.05 సెకన్లు) వరుసగా గోల్డ్‌‌, సిల్వర్‌‌ను గెలిచాయి.