ఎన్నికల కొట్లాటలు

ఎన్నికల కొట్లాటలు
  •     అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
  •     జనగామ ధర్మకంచె పోలింగ్​ కేంద్రంలో కాంగ్రెస్ ​వర్సెస్​ బీఆర్​ఎస్​
  •     పరకాలలోనూ సేమ్ ​సీన్​
  •     నిజామాబాద్ జిల్లా అబ్బాపూర్ ​బి తండాలో తెగిన ఓటరు చేతి వేలు
  •     బోధన్​లో యువకుడిపై దాడి 

పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె స్కూల్​ పోలింగ్​కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఏసీపీ అంకిత్​తో వాగ్వాదానికి దిగారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో ఓటింగ్​ తర్వాత బీఆర్ఎస్​, కాంగ్రెస్​ లీడర్లు గొడవ పడ్డారు. కాంగ్రెస్ ​లీడర్లు తమను కొట్టారంటూ బీఆర్​ఎస్ ​లీడర్లు పీఎస్​వద్ద రాత్రి వరకు ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ ​జిల్లా అబ్బాపూర్​ (బి) తండాలో తోపులాట జరగడంతో ఒకరి చేతి వేలు తెగిపోయింది. ఇదే జిల్లా బోధన్​లో ఓ యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు చితకబాదారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్​నగర్​లో తనపై ఎస్​ఐ లాఠీచార్జి చేశారని బీజేపీ బూత్ ​అధ్యక్షుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె స్కూల్​పోలింగ్​ కేంద్రంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ శ్రేణులు లొల్లికి దిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి..ఏసీపీ అంకిత్​తో వాగ్వాదానికి దిగారు. అంతకు ముందు కాంగ్రెస్ ​రాష్ట్ర యువజన లీడర్​ కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి జనగామ అసెంబ్లీ పోలింగ్​ఏజెంట్​ హోదాలో ధర్మకంచె పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దీనికి బూత్​లో ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్​ ఒకరు అభ్యంతరం తెలిపి వాగ్వాదానికి దిగాడు. ప్రశాంత్​రెడ్డి తాను పోలింగ్ ఏజెంట్​నని చెప్పినా వినిపించుకోలేదు.

దీంతో సీఐ రఘుపతి రెడ్డి అక్కడికి వచ్చి నచ్చజెప్పారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి అక్కడకు చేరుకుని పోలింగ్​ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ​లీడర్​ కొమ్మూరి ప్రశాంత్​రెడ్డిని ఎలా లోపలికి పంపించారని కార్యకర్తలతో కలిసి లొల్లి చేశారు. దీనికి ఏసీపీ.. కొమ్మూరికి పోలింగ్​ఏజెంట్​గా అనుమతి ఉండడంతో లోపలకు పంపించామని చెప్పారు.

అందరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. మరోవైపు జనగామ మండలం గానుగుపహాడ్​లో బీజేపీ లీడర్లు ప్రచారం చేస్తుండడంతో సీఐ రఘుపతి రెడ్డి వారించారు. వారు వినకపోవడంతో స్వల్పంగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. జనగామలో జరిగిన గొడవలపై పల్లా రాజేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు పక్షపాత వైఖరి అవలంభించారని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డికి ఓటమి భయం పట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని కొమ్మూరి ప్రశాంత్​ రెడ్డి అన్నారు. 

పరకాలలో హైడ్రామా 

పరకాల : హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో పోలింగ్​ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్​లీడర్ల మధ్య గొడవ జరిగింది. ఓటింగ్​ ముగిసిన తర్వాత ఏ పోలింగ్​ కేంద్రంలో ఎన్ని ఓట్లు పడ్డాయని బీఆర్ఎస్​ లీడర్లు గ్రామంలోని ఓ మహిళ ఇంటి ముందు కూర్చుని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ టైంలో అటుగా వచ్చిన కాంగ్రెస్ ​లీడర్లతో బీఆర్ఎస్ ​లీడర్లకు గొడవ మొదలైంది. ఈ సందర్భంగా తమపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు పోలీస్​స్టేషన్​ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న వారిని లోపలకు తీసుకువెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్కడకు వచ్చి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో స్టేషన్ ​ఆవరణలో బీఆర్ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రవిరాజా కల్పించుకుని తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని, ఆ డ్యూటీ పూర్తి కాగానే ఈ కేసు సంగతి చూస్తామని చెప్పినా వినిపించుకోలేదు.

దీంతో చల్లా ధర్మారెడ్డి మాజీ మంత్రి దయాకర్​రావుతో కలిసి సీపీని కలుస్తానని వెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్​ కార్యకర్తలు ఒప్పుకోలేదు. ‘మేమంతా మీకోసం ఉంటే మీరు వెళ్లిపోతా అనడం ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘మీరు వెళ్తే మేమంతా రాజీనామాలు చేస్తాం’ అని హెచ్చరించడంతో ఆయన ఆగిపోయారు. రాత్రి 9 గంటలకు సీపీతో ధర్మారెడ్డి మాట్లాడడంతో ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు.  

అబ్బాపూర్​లో తెగిన చేతి వేలు  

నవీపేట్ :  నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని అబ్బాపూర్(​బి) తండా 171 పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం పది గంటల సమయంలో తోపులాట జరిగింది. లైన్​లో ఉన్న ఓటర్లు ఒక్కసారిగా తోసుకోవడంతో పోలీసులు గేట్ వేశారు. ఈ క్రమంలో గేట్ ముందున్న అబ్బాపూర్ (​బి) తండాకు చెందిన బెండ చిన్న రాజన్న చేయి గేట్ లో ఇరుక్కుని కుడి చేతి బొటన వేలు తెగిపడింది. వెంటనే అతడిని నవీపేట్​లోని ప్రైవేట్ ​హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు వేలు తొలగించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తోపులాట జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

బోధన్​ పోలింగ్​ కేంద్రంలో యువకుడిపై దాడి  

బోధన్​ : నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ఉద్మీర్​గల్లీకి చెందిన నందిపేట్​నవీన్​పై ఓ వర్గానికి చెందిన యువకులు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. బోధన్​లోని 69వ పోలింగ్​కేంద్రంలో నవీన్​ లైన్​లో నిల్చున్నాడు. అక్కడికి వచ్చిన ఓ వర్గానికి చెందిన యువకులు ఓ పార్టీకి ఓటెయ్యాలని చెప్తుండడంతో నవీన అడ్డుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న వారు ఓటు వేసి బయటకు వచ్చిన అతడిపై ఇటుకలతో దాడి చేశారు. దీంతో అతడిని స్థానికులు గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. బోధన్ ​టౌన్ ​పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ బాధితుడిని పరామర్శించారు.  

బీజేపీ బూత్ అధ్యక్షుడిపై లాఠీచార్జ్ 

ఎల్లారెడ్డిపేట : ఎస్​ఐ రమేశ్​తనను కులం పేరుతో దూషించడమే కాకుండా లాఠీ చార్జి చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌‌ కు చెందిన బీజేపీ బూత్‌ అధ్యక్షుడు రొడ్డ మహేశ్ ఆరోపించారు. పోలింగ్​కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉన్న తనపై ఎస్​ఐ లాఠీ చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్లిపోయానని, అయినా ఇంటికి వచ్చి మరీ చేయి చేసుకున్నాడని ఆవేదన చెందారు. బీజేపీ మండల అధ్యక్షుడు  పొన్నాల తిరుపతిరెడ్డితోకలిసి ఎస్​ఐపై ఎస్పీకి  ఫిర్యాదు చేశారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట సమీపంలోని కరీంనగర్ ​డెయిరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి బీజేపీ, కాంగ్రెస్​వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ చైతన్యకుమార్​రెడ్డి తెలిపారు. బీజేపీకి చెందిన టెలికాం సెన్సార్ ​బోర్డు మెంబర్ ​రామకృష్ణ గుప్తా, మరో ఇద్దరు కారులో రాత్రి పర్మల్లకు వెళ్తుండగా ఆ ఊరికి చెందిన కాంగ్రెస్​ లీడర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో రామకృష్ణ లింగంపేట వెళ్తుండగా లింగంపేటకు చెందిన పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలు డెయిరీ వద్ద అడ్డుకున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత గ్రామాల్లో ఎందుకు తిరుగుతున్నావని  ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. రామకృష్ణ గుప్తా, కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రనారాగౌడ్​లకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని దవాఖానకు తరలించారు. ఇరువర్గాల ఘర్షణలో రామకృష్ణకు చెందిన కారు ధ్వంసమైంది. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ తెలిపారు.