గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్ బినామీ సంస్థే!ఆ సంస్థ తప్పిదాల వల్లే అప్పట్లో 27 మంది స్టూడెంట్స్ చనిపోయారు: సీఎం రేవంత్

గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్ బినామీ సంస్థే!ఆ సంస్థ తప్పిదాల వల్లే అప్పట్లో 27 మంది స్టూడెంట్స్ చనిపోయారు: సీఎం రేవంత్
  • ఆ సంస్థ తప్పిదాల వల్లే అప్పట్లో 27 మంది స్టూడెంట్స్​ చనిపోయారు
  •     అదే పేరు మార్చుకొని నీట్​ పరీక్షలు నిర్వహించి లీకేజీలకు కారణమైంది
  •     అసెంబ్లీలో మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి
  •     గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్​
  •     ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్న అడిగితే.. పేర్లతో సహా లిస్ట్ ఇస్తం
  •     మేము తెరిచిన ధర్నా చౌక్​లో కేటీఆర్ ధర్నా చేసుకోవచ్చని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్ బినామీ సంస్థే అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌‌‌‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ సంస్థ ఇంటర్ పేపర్లు సరిగ్గా దిద్దకపోవడంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. విద్యార్థుల మరణానికి కారణమైన కేటీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జరుగుతున్న సెంట్రల్ హాల్, ఇతర నిర్మాణ పనులను గురువారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ హాల్‌‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘నాటి గ్లోబరీనా సంస్థే ఇప్పుడు పేరు మార్చుకొని నీట్​పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్ పొందింది.. దాని వల్లే మొన్నటి నీట్ పేపర్ లీకేజీ జరిగింది..’ అని సీఎం ఆరోపించారు. గ్లోబరీనా తన బినామీ సంస్థ కాదని, తప్పుడు ఆరోపణలు చేసిన సీఎంపై  పరువు నష్టం దావా వేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేయగా, రేవంత్ తీవ్రంగా స్పందించారు. ‘కేటీఆర్​కు పరువు ఉంటే కదా.. పరువు నష్టం దావా వేయడానికి! కేటీఆర్ కు పరువే లేదు.. ఇక పరువు నష్టం ఎక్కడిది? ’ అన్నారు. ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ అసెంబ్లీలో చర్చ పెడితే.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో పేర్లతో సహా లిస్ట్ ఇస్తానని సీఎం స్పష్టం చేశారు. తమ రెండున్నరేళ్ల పాలనలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, దీనికోసం చర్చకు సిద్ధమన్నారు. జన్వాడ ఫామ్‌‌హౌస్‌‌ భూములు ఏ రాజు నుంచి కేటీఆర్‌‌‌‌కు వచ్చాయో తెలియాలన్నారు. ఆ భూములు తనవి కాదని కేటీఆర్ ఫిర్యాదు చేస్తే, విచారణ చేయిస్తానని సీఎం చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు.

మేము తెరిచిన ధర్నా చౌక్​లో కేటీఆర్​ ధర్నా


తాము తెరిచిన ధర్నా చౌక్‌‌లో ఇప్పుడు కేటీఆర్ ధర్నా చేస్తామంటున్నాడని, ఆనాడు బీఆర్ఎస్ ధర్నా చౌక్‌‌ను ఎత్తేస్తే ధర్నా చౌక్ ఉండాల్సిందేనని మాట్లాడింది కాంగ్రెస్ కాదా అని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌‌ను దృష్టిలో పెట్టుకునే బీజేపీ సర్ ప్రక్రియను కొనసాగిస్తున్నదని సీఎం ఆరోపించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఎక్కువగా కాంగ్రెస్ వైపే ఉంటారు.. సర్ పేరుతో ఈ ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ ఓట్లు పోయినట్లే.. సర్ అంటే ఓట్ల ప్రక్షాళన, కానీ దీన్ని కుట్ర పూరితంగా కేంద్రం వాడుతోంది..’ అని సీఎం ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ఓట్లు పోయే అవకాశం ఎక్కువగా ఉందని, వారికి సరైన అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడమే ఇందుకు కారణమని సీఎం అన్నారు. ఓటు హక్కు లేకపోతే ప్రభుత్వ పథకాలు పోతాయని, ఆధార్ పోతుందని, చివరకు గుర్తింపే ఉండదన్నారు. అందుకే పార్టీ తరఫున బీఎల్ఏలను పెట్టినట్లు చెప్పారు. ఇంత కీలకమైనందునే సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మా పార్టీ నేతలకు సూచించానని, గాంధీ భవన్‌‌కు కూడా రావద్దన్నానని గుర్తుచేశారు. సర్ ప్రక్రియ ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పూర్తయిందని, మరో 30 శాతం పూర్తి కావాల్సి ఉందన్నారు. జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌గా సోమేశ్ కుమార్ ఉన్నప్పుడు ఆంధ్రవాళ్లకు సంబంధించిన 25 లక్షల ఓట్లను కేసీఆర్ తొలగించారని, ఇప్పుడు బీజేపీ సర్ పేరుతో పేదల ఓట్లను తొలగిస్తోందని సీఎం ఆరోపించారు. బీజేపీ వాళ్లకు కేసీఆర్ కుల గురువని సీఎం వ్యాఖ్యానించారు.

నాకు రెండు ఓట్లు లేవు.. 

తనకు రెండు ఓట్లు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ తనకు రెండు ఓట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. కానీ మరోసారి ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తే లోపలేయిస్తానంటూ ఫైర్ అయ్యారు. ‘మొదట్లో మా గ్రామంలో ఉన్న ఓటును కలెక్టర్‌‌‌‌కు దరఖాస్తు చేసుకొని కొడంగల్‌‌కు మార్చుకున్నాను’ అని సీఎం స్పష్టంచేశారు.
కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడుతోంది.. 

హైడ్రా బాగా పనిచేస్తోందని సీఎం కితాబు ఇచ్చారు. ‘హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల విలువజేసే భూము లకు, ఆస్తులకు హైడ్రా రక్షణ కల్పించింది’ అని చెప్పారు. అమెరికా కన్స్యూలేట్ జనరల్ కార్యాలయం రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడంపై ప్రస్తావిస్తూ ‘తెలంగాణలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే.. వాళ్ల పేర్లను రోడ్లకు పెడితే తప్పేమిటి’ అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయని, ఆ పార్టీ నేతలకు ఒకరంటే మరొకరికి పడదన్నారు. వారు అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తుంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లను బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు బ్రోకర్లకు అమ్ముకొని దళారీ వ్యవస్థను తెచ్చారని ఆరోపించారు. తాము పారదర్శకంగా చెప్పిందే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటి స్థలం ఉంటే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు గ్రామాల్లో రూ. 5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

పనులు నాణ్యంగా, వేగంగా చేయాలి

అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టిన మరమ్మతు  పనులను పూర్తి నాణ్యతతో, మరింత వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురు వారం ఆయన అసెంబ్లీలో జరుగుతున్న సెంట్రల్ హాల్, మంత్రుల కార్యాలయాల రిపేర్ల పనులను పరిశీ లించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పనులన్నీ పూర్తి కావాలని   అసెంబ్లీ, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్‌‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి ఉన్నారు.

హరీశ్ గొప్పవాడైతే కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టిండు

హరీశ్ రావు గొప్పవాడైతే అతన్ని ఇరిగేషన్ శాఖ నుంచి కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టాడని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌కు తెలియకుండా కాళేశ్వరంలో వందల కోట్ల రూపాయలు తీసుకున్నందుకే హరీశ్‌‌ను మంత్రి పదవి నుంచి తప్పించాడని రేవంత్ ఆరోపించారు. లేదంటే ఇరిగేషన్ శాఖ నుంచి ఆనాడు కేసీఆర్ ఎందుకు తప్పించాడో హరీశ్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. అతి తెలివితేటలు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడుతానంటే నడవదని హరీశ్‌‌పై సీఎం ఫైర్​అయ్యారు. హరీశ్ గాని, బీఆర్‌‌‌‌ఎస్ నేతలు గాని మేడిగడ్డ గురించి మాట్లాడకుండా కన్నెపల్లి పంప్‌‌హౌస్ గురించి మాట్లాడుతున్నారని, మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది వాళ్లేనని, అందుకే దాని గురించి మాట్లాడరని సీఎం రేవంత్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్‌‌డీఎస్‌‌ఏ ఆదేశాలనే తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏమైనా అంటే తెలంగాణ కోసం రక్తం ధారపోస్తున్నామని బీఆర్ఎస్ పెద్దలు అంటారని, ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్  ఎప్పుడైనా చుక్క రక్తం ఇచ్చారా?’ అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు రక్తం ధారపోశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు పేదల రక్తం అమ్ముకుంటున్నారని సీఎం ఆరోపించారు.