సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్ రిజైన్‌‌ చేయాలి : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌

సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్ రిజైన్‌‌ చేయాలి : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌
  • జేపీ ప్రయోజనాల కోసమే సీఈసీ పని చేస్తున్నారని ఫైర్​
  • 28న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటన

నిజామాబాద్, వెలుగు: అనర్హుల ఓట్లు తొలగించడం ఎంత ముఖ్యమో, అర్హులందరూ ఓటు కలిగి ఉండడం అంతే ముఖ్యమని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌ అన్నారు. ఈ రెండు అంశాలను నిబంధనలకు లోబడి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌‌ కుమార్‌‌.. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. జ్ఞానేశ్‌‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. శనివారం నిజామాబాద్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సర్ పేరుతో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయని, ఇందుకు కారణాలు ఏమిటి? ఎంత మందిని తొలగించారు? ఎంత మంది అభ్యంతరాలు తెలిపారు? ఎన్ని పేర్లు తిరిగి చేర్చారో రాష్ట్రాలవారీగా బహిర్గతపరచాలన్నారు. ఓటర్ల డేటాను ఈజీగా మార్చే విధానం సీఈసీ వద్ద ఉంటే క్షేత్రస్థాయిలో ఈఆర్‌‌వోల (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్) పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఓటర్ డేటాను ఎవరు, ఎందుకోసం మార్చారో దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కును అనేకసార్లు వినియోగించుకున్న పౌరుల పేర్లు డ్రాఫ్ట్ లిస్ట్‌‌లో చేర్చకపోవడమేంటని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఓటర్ల జాబితా సవరణను బీజేపీ ప్రయోజనాల కోసం సీఈసీ పని చేస్తున్నారని ఆరోపించారు. ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఇబ్బంది పెట్టేలా వివరాలు అడుగుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌‌ మొదటి నుంచి ఎలక్షన్ కమిషన్ చర్యలను అనుమానిస్తుందని, ఇప్పుడు ఇద్దరు కమిషనర్లు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేయడంతో బీజేపీ కుట్రలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత జ్ఞానేశ్‌‌కుమార్‌‌కు లేదన్నారు. సీఈసీ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్‌‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో కూడా కాంగ్రెస్‌‌ నాయకులు నిరసనలు తెలుపుతారని వెల్లడించారు.

అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌‌ జయంతి సందర్భంగా డీసీసీ ఆఫీస్‌‌లో ఆయన ఫొటోకు శ్రద్ధాంజలి ఘటించారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆర్యానగర్‌‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నుడా చైర్మన్ కేశవేణు, డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్‌‌రెడ్డి, నాయకులు బొబ్బిలి రామకృష్ణ, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.