కొత్త వేరియంట్ పై తెలంగాణ అలర్ట్

కొత్త వేరియంట్ పై తెలంగాణ అలర్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: డెల్టా వేరియంట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కొత్త వేరియంట్ ​ఒమిక్రాన్​ వేగంగా వ్యాపించే చాన్స్​ ఉన్నందున ప్రజలు అలర్ట్​గా ఉండాలని, రెండు డోసుల టీకా వేసుకోవాలని డీహెచ్​ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం కోఠిలోని డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హెల్త్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్​ తీసుకోని వారికి కొత్త వేరియంట్ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉందనే విషయం ఇతర దేశాల పరిస్థితులను పరిశీలిస్తే అర్థం అవుతోందన్నారు. ఈ వేరియంట్ ఇప్పటి వరకు మన దేశంలోకి ప్రవేశించలేదన్నారు. కొత్త వేరియంట్​ కేసులు వస్తే తామే వెల్లడిస్తామని, సోషల్ మీడియాల్లో వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దని సూచించారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో సర్వైలెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేశామన్నారు.

రిస్క్​లిస్టులో ఉన్న 12 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌కు బుధవారం ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ టెస్టులు చేస్తామన్నారు. రిపోర్టులు వచ్చే దాకా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం రిస్క్ దేశాల నుంచి 41 మంది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రాగా, వారందరికీ నెగటివ్ ​వచ్చిందన్నారు. అయినా 14 రోజులు ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండాలని సూచించామన్నారు. టెస్టులో పాజిటివ్​వస్తే బాధితులకు టిమ్స్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని తెలిపారు. యాంటీజెన్,  ఆర్టీపీసీఆర్ ​విధానంలో ఒమిక్రాన్ ఫలితం తేలిపోతుందన్నారు. కొత్త వేరియంట్​లోనూ ఒళ్లు నొప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇప్పటిదాకా కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌లో 35 లక్షల మ్యుటేషన్లు జరిగాయన్నారు. 

టెస్టింగ్​ కిట్లు రెడీ..

ఒమిక్రాన్​ను ఎదుర్కోవడానికి ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌, టెస్టింగ్‌‌‌‌‌‌‌‌ కిట్లు రెడీ చేశామని శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో 66 వేల బెడ్స్‌‌‌‌‌‌‌‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా 90% ఫస్ట్‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌, 46% సెకండ్‌‌‌‌‌‌‌‌ డోస్‌‌‌‌‌‌‌‌ పూర్తయిందన్నారు. తక్కువ వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, నిర్మల్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, నారాయణపేట్‌‌‌‌‌‌‌‌, గద్వాల జిల్లాల్లో బుధవారం నుంచి స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చేపడతామన్నారు. సెకండ్‌‌‌‌‌‌‌‌ డోసు తీసుకోకుండా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తయినట్లు మెసేజ్‌‌‌‌‌‌‌‌లు వచ్చిన విషయంలో ఇప్పటికే ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశామన్నారు. ఇలాంటి వాటిపై 91541 70960కు వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా కంప్లయింట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చన్నారు. ప్రజలు మాస్కు పెట్టుకోవాలని, అదే అందరి జేబు వ్యాక్సిన్ అని ​పేర్కొన్నారు.