రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్

రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్

హైదరాబాద్, వెలుగు:  రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అవసరమైనన్ని రోజులు రిజర్వేషన్లు కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆదివారం హైదరాబాద్​లో ఓ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్ అవుతోందని, కానీ సమాజంలో బేధభావాలు పోయేంత వరకూ రిజర్వేషన్లు అవసరమన్నారు. 

ఆర్ఎస్ఎస్ పై కొందరు స్వార్థంతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ పూర్తిగా సమర్థిస్తోందని, ఎవరి కోసం అయితే రిజర్వేషన్లు కేటాయించారో.. వారి అభివృద్ధి జరిగే వరకూ అవి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. దీనిపై కొందరు వివాదం సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నరాని.. దాంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మాతృభాషలో విద్య చాలా అవసరమని, భాషపైనే భావం ఎక్కువగా దృష్టి పెడుతుందన్నారు. విద్యను జ్ఞానం కోసం, ధనాన్ని దానం కోసం, కండబలాన్ని దేశం కోసం ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. ఎంతో శ్రమించి పట్టుదలతో స్కూల్ నిర్మించారని, వారికి అభినందనలు తెలిపారు.