కారు కార్ఖానాకు పోయింది.. వాపస్ రాదు : సీఎం రేవంత్ రెడ్డి

కారు కార్ఖానాకు పోయింది.. వాపస్ రాదు :  సీఎం రేవంత్ రెడ్డి

ఎల్బీనగర్/ సికింద్రాబాద్ వెలుగు: బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు ఇక తిరిగి రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇప్పుడు బస్సు వేసుకుని కొంగ జపం చేస్తున్నారని విమర్శించారు. ‘‘తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కేందుకు దిగేందుకే సమయం సరిపోయిందన్నట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి. కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది. ఇక తిరిగి రాదు. ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారు. ఆయనను నమ్మితే లటుక్కున మింగేస్తాడు జాగ్రత్త. ఈ కొంగకు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్టే” అని అన్నారు. ఆదివారం మల్కాజ్​గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎల్బీనగర్, యాప్రాల్​​లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్​లలో రేవంత్ పాల్గొన్నారు. మల్కాజ్​గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఆనాడు మీరు నన్ను ఆదరించడం వల్లే ఈనాడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించినట్టే సునీతమ్మను ఆదరించాలి” అని ప్రజలను కోరారు. హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, ముంపు సమస్యను పరిష్కరిస్తామని, మూసీ ప్రక్షాళన చేస్తామని, 118 జీవో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘‘బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏనాడైనా మీ సమస్యలను అడిగేందుకు ఇక్కడికి వచ్చారా? వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు. బండి రాలే గుండు రాలేదు.. కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాడు. రాజేందర్ బీఆర్ఎస్ లో మంత్రిగా పని చేసినప్పుడు మన ఎల్బీనగర్ కు ఏం చేయలేదు.. ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఏం చేయడు” అని అన్నారు. 

తెలంగాణకు మోదీ అన్యాయం..  

తెలంగాణను నిండా ముంచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. పదేండ్లయినా విభజన హామీలు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. ‘‘బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. నిధులు ఇవ్వలేదు.. పరిశ్రమలు ఇవ్వలేదు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే.. మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలి” అని అన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట అని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘దేవుడి పేరు చెప్పుకుని కొందరు బిచ్చమెత్తినట్టు.. రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. మా తాతలు తండ్రుల కాలం నుంచే శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలు చేస్తున్నం. మైసమ్మ, పోచమ్మకు కోడి కోసి మొక్కుతున్నం” అని అన్నారు. రోడ్ షోలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.  

బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం.. 

బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని రేవంత్ అన్నారు. ‘‘ఇటీవల ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వయంగా బీజేపీ మల్కాజ్​గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ను కలిసి.. ‘నువ్వు గెలుస్తున్నావ్’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు. దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అర్థమవుతున్నది. లేదంటే ఈటల గెలుస్తున్నాడని మల్లారెడ్డి బహిరంగంగా చెప్పినా కేసీఆర్ ఎందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? ఎందుకు సస్పెండ్ చేయలేదు?” అని ప్రశ్నించారు. ‘‘ఈ పదేండ్లలో మోదీ, కేసీఆర్ తెలంగాణను పట్టించుకోలేదు. వీళ్లిద్దరు తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఇలాంటి వాళ్లు ఎలా ఓట్లు అడుగుతారు? బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు” అని అన్నారు.  ‘‘కేసీఆర్ పదేండ్ల పాలన చూసి ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. దీంతో కేసీఆర్ దిమ్మతిరిగి ఈ రోజుఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఆయన కాళ్లు పైకి, చేతులు కిందికి పెట్టి తిరిగినా ప్రజలు నమ్మరు. డిసెంబరు 3న కారును షెడ్డుకు పంపించారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టింది. తుప్పు పట్టిన కారు ఇక రాదు. తుప్పు పట్టిన కారును కొంటామంటూ ఇనుప సామాన్లోళ్లు గజ్వేల్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు” అని అన్నారు.

ఆరు గ్యారంటీలు దేశానికి ఆదర్శం: మధుయాష్కీ 

రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలోనూ తెలంగాణ మోడల్​ను తీసుకున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. రబ్బర్ చెప్పుల హరీశ్ రావుకు దడ పుట్టి, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘మా ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేసినా, కూల్చాలని ప్రయత్నం చేసినా.. మీ ఒంటిపై బట్టలు ఉండవు” అని హెచ్చరించారు.