సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు క్లోజ్: బీఆర్ఎస్‎కు ఎదురు దెబ్బ

 సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు క్లోజ్: బీఆర్ఎస్‎కు ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్పోజ్ చేసింది. ఈ పిటిషన్లపై విచారణ ముగించినట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు క్లోజ్ కావడంతో బీఆర్ఎస్‎కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం (మార్చి 12) జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై స్పీకర్ తీర్పు ప్రకటించినట్టు కోర్టుకు తెలిపారు. సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ ముగించినట్లు ప్రకటించింది. 

అయితే.. స్పీకర్ తీర్పు కాపీలు మాకు ఇంకా అందలేదని బీఆర్ఎస్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు రోజుల్లో తీర్పు కాపీలు పిటిషనర్లకు ఇవ్వాలని.. అలాగే ఈ కేసు ఆధారాలు, పిటిషనర్ అడిగే వివరాలు 4 రోజుల్లో అందచేయాలని స్పీకర్‌ను ఆదేశించింది సుప్రీం కోర్టు.

కాగా, పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, బండ్ల క్రిష్ణా మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్​ గౌడ్, డాక్టర్ సంజయ్‎లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని.. ఇప్పటికీ వారంతా బీఆర్ఎస్‎లోనే కొనసాగుతున్నట్లు గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.