నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం: ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు

నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం: ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు
  • అర్ధరాత్రి రోడ్డెక్కిన ఓయూ లేడీస్​ హాస్టల్​ స్టూడెంట్లు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్​లో కొన్నిరోజులుగా సరిపడా నీళ్లు లేకనానా ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్లు వాపోయారు. హాస్టల్​లో కనీసం తాగేందుకు కూడా నీళ్లు ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి 11 గంటలకు హాస్టల్​సమీపంలోని హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ నాయకులతోపాటు పలువురు విద్యార్థులు వారికి మద్దతు తెలిపారు. లేడీస్​హాస్టల్ స్టూడెంట్లు మాట్లాడుతూ..తక్షణమే లేడీస్ హాస్టల్ డైరెక్టర్, యూనివర్సిటీ వీసీ రావాలని నినాదాలు చేశారు. లేడీస్ హాస్టల్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకునే నాథుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఏదో ఒక సమస్య ఉంటోందని, ఆడ పిల్లలకు కనీస వసతులు కల్పించడం లేదని వాపోయారు.

స్థానిక మోటార్​చెడిపోవడంతో కొన్నిరోజులుగా వాటర్​ట్యాంకర్లు తెప్పిస్తున్నారని, అవి సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం వర్సిటీకి వచ్చిన తాము అధికారుల నిర్లక్ష్యానికి  బలి అవుతున్నామని బాధపడ్డారు. ఆందోలన చేసినరోజు స్పందించి, తర్వాత వదిలేస్తున్నారని, లేడీస్​హాస్టల్​లోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​చేశారు.

ఆందోళనలో ఏబీవీపీ నాయకులు పృథ్వీ, అలివేలి రాజు తదితరులు పాల్గొన్నారు.