2018లోనే ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ నిబంధన ఎత్తేసిన సర్కార్
లోకల్ కేడర్ మార్చడానికి వీల్లేకున్నా ‘స్పౌజ్’ బదిలీలకు సై
స్పౌజ్ కోటా అంతాహైదరాబాద్‌కే ఆప్షన్
నిబంధనలు సవరించకుండానే ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్
ఇష్టారీతిన వ్యవహరిస్తున్న శాఖాధిపతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ తీవ్ర గందరగోళంలో పడింది. ప్రస్తుతం నడుస్తున్న బదిలీల జాతరలో నిబంధనల ఉల్లంఘనలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఉనికిలోనే లేని, ఎప్పుడో రద్దయిపోయిన నిబంధనలను ఆధారంగా చేసుకుని ట్రాన్స్ఫర్లు చేయడానికి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు (హెచ్‌ఓడీలు) తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల (స్పౌజ్) కేటగిరీ బదిలీల్లో లోకల్ కేడర్ రూల్స్ గాల్లో దీపంగా మారాయి. 2018లోనే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా తొలగించిన ‘ప్రజా ప్రయోజనం’ (పబ్లిక్ ఇంట్రెస్ట్) అనే క్లాజును అడ్డం పెట్టుకుని, స్థానికతను మార్చేస్తూ బదిలీలకు తెరలేపడం ఇప్పుడు సెక్రటేరియెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే?
స్పౌజ్ కేటగిరీ ఉద్యోగుల సమస్యలపై 2021లో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం స్పష్టమైన సిఫార్సులు చేసింది. దంపతుల్లో ఒకరు పనిచేసే చోటికి సమీపంలో ఖాళీలు ఉంటేనే బదిలీ లేదా డిప్యుటేషన్ ఇవ్వాలని, దీనికోసం జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ప్రత్యేకంగా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సైతం గతేడాది అక్టోబరులోనే దీనిపై ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చింది.
అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సవరణ ఉత్తర్వులు రాకుండానే, ఆర్థికశాఖ బదిలీల ఉత్తర్వులు ఎలా ఇచ్చిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, 2018 ఆగస్టు 30న ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులలో ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ అనే నిబంధనను పూర్తిగా తొలగించారు. గతంలో (ఉమ్మడి ఏపీలో 1977 నాటి జీవో ప్రకారం) ఈ నిబంధన ఆధారంగానే ఏసీబీకి దొరికిన వారిని లేదా దంపతులైన ఉద్యోగులను ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు మార్చే అధికారం ప్రభుత్వానికి ఉండేది.
కానీ, 2018 సవరణతో ఆ అధికారమే రద్దయింది. చట్టబద్ధంగా ఈ నిబంధన పునరుద్ధరించనంత వరకు, ఏ శాఖ కూడా ఉద్యోగి స్థానికతను మార్చి వేరే కేడర్‌కు బదిలీ చేయడానికి వీల్లేదు. కానీ, గత నెల 21న ఆర్థికశాఖ ఇచ్చిన సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో మాత్రం స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు చేసుకోవచ్చని పేర్కొనడం గమనార్హం.
హెచ్‌ఓడీల నిర్లక్ష్యం..
దంపతులు వేర్వేరు శాఖల్లో పనిచేస్తుండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. బదిలీల దరఖాస్తులు పరిశీలించే సమయంలో హెచ్‌ఓడీలు కనీస విచారణ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. భర్త లేదా భార్య ఏ శాఖలో, ఏ కేడర్‌లో, ఎంతకాలంగా పనిచేస్తున్నారు? గతంలో ఎప్పుడైనా స్పౌజ్ కేటగిరీని వాడుకుని నగరాలకు లేదా జిల్లా కేంద్రాలకు బదిలీపై వచ్చారా? అనే వివరాలను రాతపూర్వకంగా తీసుకోవడం లేదు. ఇద్దరి అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఇద్దరిలో ఒకరికి మాత్రమే (అది కూడా కిందిస్థాయి లోకల్ కేడర్ పరిధిలోనే) బదిలీకి అవకాశం కల్పిస్తేనే ఈ గందరగోళానికి తెరపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సిటీలకు క్యూ.. గ్రామీణ ప్రాంతాలు ఖాళీ
స్పౌజ్ బదిలీల ముసుగులో స్థానిక నిరుద్యోగులకు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు.. భార్య ఉమ్మడి ఖమ్మం జిల్లా కేడర్‌లో క్షేత్రస్థాయి ఉద్యోగం చేస్తూ, భర్త హైదరాబాద్‌లో మల్టీజోన్ పరిధిలో ఉన్నతోద్యోగంలో ఉంటే, స్పౌజ్ కింద భార్య హైదరాబాద్‌కు రావాలని చూస్తున్నారు. ఇలా స్థానికతతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల్లోని ఫోకల్ పోస్టులకు బదిలీల కోసం పైరవీలు మొదలయ్యాయి. దీనివల్ల నగరాల్లో పోస్టులు బ్లాక్ అయిపోయి, స్థానిక నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతింటున్నాయి. నిబంధనల ప్రకారం.. భర్తను భార్య పనిచేసే కిందిస్థాయి లోకల్ కేడర్ జిల్లాకు పంపాలి. కానీ, ఉద్యోగులెవరూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో నగరాల్లో పోస్టుల కొరత, గ్రామాల్లో ఖాళీల సమస్య వేధిస్తున్నది.
సంఘం పేరు చెప్పి తిష్ట
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో కొన్ని సంఘాల నేతలు మినహాయింపులు పొందుతూ, కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకుంటున్నారు. ఆ విషయాన్ని బదిలీ ఉత్తర్వుల్లో రికార్డు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో నిబంధనల ప్రకారం బదిలీ కావాల్సిన వారు ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోతుండగా, సామాన్య ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.
అయితే, ఆ మినహాయింపులతో పోస్టింగ్ పొందినట్లు బదిలీ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనడం లేదు. గతంలో ఇలాంటి మినహాయింపులు పొందిన విషయాన్ని కూడా దాచిపెట్టి, పదేపదే లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు కేవలం 9 ఉన్నప్పటికీ, వందలాది సంఘాల నేతలు ఒత్తిడి తెచ్చి బదిలీల్లో మినహాయింపులు పొందుతున్నట్టు తెలుస్తున్నది.
ఎంప్లాయిమెంట్ అండ్ట్రైనింగ్ డిపార్ట్మెంట్రీజినల్ డైరెక్టరేట్ ఆఫీస్‌లో సూపరింటెండెంట్‌గా యూనియన్పేరుతో ఒక ఉద్యోగి 20 ఏండ్లుగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా మళ్లీ అక్కడే కొనసాగేందుకు యూనియన్ పేరు వాడుతున్నట్లు సమాచారం. ఇలా జిల్లాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి పోస్టు దాకా చాలామంది సంఘం పేరుతో బదిలీల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రభుత్వానికి కంప్లయింట్స్ వచ్చాయి.
ఆరేండ్లు దాటితే సంఘం నేతలైనా బదిలీ కావాల్సిందే..
రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోల ప్రకారం.. ఒకే చోట ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఏ ఉద్యోగి అయినా, వారు సంఘం నేతలైనప్పటికీ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. వీరికి ‘నాన్ ఫోకల్’ (ప్రాధాన్యత లేని) స్థానాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని మార్గదర్శకాలున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2012లో జారీ చేసిన సర్వీసు నిబంధనలను బేఖాతరు చేస్తూ, చాలా మంది నేతలు నగరాల్లోని కీలకమైన పోస్టుల్లోనే 15 నుంచి 25 ఏళ్లుగా కొనసాగుతుండటం గమనార్హం.
అధికారికంగా గుర్తింపు లేని సంఘాల నేతలు కూడా తాము యూనియన్ కార్యవర్గంలో ఉన్నామని, ఆ హోదాలో తమకు బదిలీ నుంచి మినహాయింపు ఉంటుందని శాఖాధిపతులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లోని పోస్టుల్లోనే దశాబ్దాలుగా తిష్ట వేశారు. దీనివల్ల ఇతర ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.
