స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : రాష్ట్ర స్వర్ణకార సంఘం

స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : రాష్ట్ర స్వర్ణకార సంఘం
  •     లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
  •     రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్​ను ఏర్పాటు చేయడంతోపాటు వారికి రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. బుధవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వింజమూరి రాఘవాచారి, చేపూరి వెంకటస్వామి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లవుతున్నా అట్టడుగు వర్గాలుగా ఉన్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. జ్యువెలరీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడం వల్ల స్థానిక స్వర్ణకారులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

2009లో అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, జీవో 272ను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను సవరించి అమలు చేయాలని, అలాగే 50 ఏండ్లు దాటిన స్వర్ణకారులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడితో పాటు 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.