హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చైర్మన్‌గా, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ-విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ముందుగా ఈ కమిటీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు గైడ్‌లైన్స్ రూపొందిస్తుంది.
ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. అనంతరం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీకి అవసరమైన సహాయక సహకారాలు అందించాలని అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
