త్వరలోనే మరికొందరు కాంట్రాక్టు..లెక్చరర్ల రెగ్యులరైజేషన్

త్వరలోనే మరికొందరు కాంట్రాక్టు..లెక్చరర్ల రెగ్యులరైజేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంకా రెగ్యులరైజ్ కాని కాంట్రాక్టు లెక్చరర్లను కూడా దశలవారీగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మెజార్టీ కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయగా, అర్హులుగా ఉండి వివిధ కారణాలతో మిగిలిన పోయిన వారినీ రెగ్యులర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీల్లో క్రమబద్ధీకరణకు అర్హులైన మరో15 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అయితే కొత్తగా మూడు పాలిటెక్నిక్ కాలేజీలకు సర్కారు అనుమతించింది.

ఆయా కాలేజీల్లో పోస్టులు మంజూరు కాగానే, వారిని ఆయా పోస్టుల్లో సర్దుబాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క డిగ్రీ కాలేజీల్లోనూ 30 మంది వరకు కాంట్రాక్టు లెక్చరర్లు తాజాగా పీహెచ్​డీ పూర్తి చేయడంతోపాటు నెట్/ సెట్ క్వాలిఫై అయ్యారు. దీంతో వారిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విభాగంలో కొందరు కాంట్రాక్టు లెక్చరర్లకు ఇతర రాష్ట్రాల్లో డిస్టెన్స్​లో చదివినట్టు సర్టిఫికెట్లున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు ఆయా వర్సిటీలకు లేఖలు రాశారు. 

దీనిపై వారి నుంచి సరైన స్పందన రాలేదు. ఆయా అభ్యర్థులు చదివినట్టు మాత్రమే ప్రకటించగా, స్టడీ సెంటర్ ఎక్కడనేది స్పష్టత ఇవ్వలేదు. దీంతో వీరిని రెగ్యులరైజ్ చేయాలా? లేదా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఆయా కోర్సులకు సంబంధించిన శాంక్షన్డ్ పోస్టులు లేవు. అందుకే ఆయా పోస్టులకు శాంక్షన్ ఇచ్చి, వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఇంటర్ కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలను పంపించారు. దీంతో దశలవారీగా రెగ్యులరైజేషన్ చేయాలని సర్కారు యోచిస్తున్నది.