- ఇకపై ప్రతి నెలా అకౌంట్లలోకి నిధులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏళ్ల తరబడి శాపంగా మారిన ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల డైట్ చార్జీలు, కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా సకాలంలో విడుదల చేయాలని నిర్ణయించింది. మొదట మూడు నెలలకోసారి (త్రైమాసిక) నిధులు ఇచ్చేలా మార్పులు చేసి, ఇప్పుడు దాన్ని ఏకంగా నెలవారీ చెల్లింపుల విధానంగా మార్చడం గమనార్హం.
నెలవారీ చెల్లింపుల నూతన విధానంలో భాగంగా వివిధ సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం తక్షణమే రూ. 221.24 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భారీ నిధుల కేటాయింపుతో వసతి గృహాల్లోని లక్షలాది మంది విద్యార్థుల సంక్షేమానికి పూర్తి స్థాయి నిరంతర మద్దతు లభించినట్లయింది. ‘‘అణగారిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, మెరుగైన వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. వారిని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే మా ఏకైక లక్ష్యం”అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
