హైదరాబాద్, వెలుగు: మన సర్కారు బడి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. హైదరాబాద్ చెరువుల గొలుసుకట్టు వ్యవస్థపై వారు చేసిన పరిశోధన తిరుపతి ఐఐటీలో జరిగిన బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమలగిరి గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న జోగేశ్, రితిక్, టీచర్ హిరణ్య హంస్రాల పర్యవేక్షణలో ‘రీకనెక్టింగ్ హైదరాబాద్ చెరువులు’ అనే ప్రాజెక్టును రూపొందించారు.
నగరంలో ముంచెత్తుతున్న వరదలకు కారణమైన గొలుసుకట్టు వ్యవస్థ విధ్వంసాన్ని వీరు శాస్త్రీయంగా విశ్లేషించి, దేశ విదేశాల ప్రతినిధుల మెప్పు పొందారు. హెచ్‌ఎండీఏ మ్యాపుల సాయంతో నగరంలోని 30 చారిత్రక చెరువుల అసలు విస్తీర్ణం ఎంత.. ప్రస్తుతం ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి? కాల్వలు ఎక్కడెక్కడ తెగిపోయాయి? అనే అంశాలను పక్కాగా గుర్తించి ప్రజంటేషన్ ఇచ్చారు. విద్యార్థుల వైజ్ఞానిక జిజ్ఞాసను మెచ్చుకుంటూ ఐఐటీ తిరుపతి డైరెక్టర్ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ఘనత సాధించడంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హర్షం వ్యక్తం చేశారు.
