హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డులను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ ఉద్యోగులందరి సర్వీస్ రిజిస్టర్లను (ఎస్ఆర్) స్కాన్ చేసి, డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయాలని ఆర్థిక శాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో ఈ-పెన్షన్, పేరోల్ ప్రాసెసింగ్, సెలవుల నిర్వహణ వంటి సేవలు మరింత వేగంగా, సులభంగా అందనున్నాయి.
ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.. మే 31వ తేదీలోగా అప్‌లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అన్ని సెక్రటేరియెట్ విభాగాలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ తమ పరిధిలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (డీడీఓ) లాగిన్ ద్వారా ఈ స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
