- 2 లక్షల కొత్త పెన్షన్లు,
- సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు
- కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..
- ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్
- ఆరు గ్యారంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్
- త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధివిధానాలు ఖరారు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన ‘జూన్ 2’ను పురస్కరించుకొని రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా, ఇప్పుడు ‘సెకండ్ ఫేజ్’ పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మిగిలిపోయిన హామీలను నెరవేర్చడంతో పాటు, కొత్త అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.
ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు జూన్ 2న వెలువడనున్నాయి. ఇదే నెలలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ఆయా పథకాలపై సుదీర్ఘంగా చర్చించి, నిధుల కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.
ఇందిరమ్మ ఇండ్లు.. డబుల్ ఇండ్లపై ఫోకస్
ఇక సొంతింటి కలను సాకారం చేసే 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' రెండో దశకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఇండ్ల నిర్మాణానికి జూన్ 2 నుంచి నిధులు విడుదల చేయనున్నారు. సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. గత ప్రభుత్వంలో తలెత్తిన లోపాలను సవరిస్తూ ప్రస్తుత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లబ్ధిదారుల జీవనోపాధికి 20 నుంచి-30 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించడం వల్ల లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీనిని గ్రహించిన ప్రభుత్వం, ఈ రెండో దశలో లబ్ధిదారుల ప్రస్తుత నివాసానికి కేవలం 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు కేటాయించాలని నిబంధనలు మార్చింది.
అలాగే గత ప్రభుత్వం నిర్మించి, కనీస మౌలిక వసతులు లేక నిరుపయోగంగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించి రెండో దశలో అర్హులకు అప్పగించనున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలుపుకుని దాదాపు 23.51 లక్షల మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య సౌకర్యం కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులను జూన్ 2 నుంచి పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 1,998 రకాల వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందనుంది.
విద్య, ఉపాధి, వైద్య రంగాల్లోనూ కొత్త నిర్ణయాలు అమలు
విద్య, ఉపాధి, వైద్య రంగాల్లోనూ జూన్ 2 నుంచి విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అధునాతన మౌలిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ప్రత్యేక రవాణా (ట్రాన్స్‌పోర్ట్) సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలో మోడల్ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకోసం రూ. 500 కోట్లను కేటాయించింది. ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని, జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల (ఇంటర్మీడియట్) విద్యార్థులకు కూడా విస్తరిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా టిఫిన్కూడా అందించనున్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం 'సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్'ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. జర్మనీ లాంటి దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ, వీసా గైడెన్స్ ఇచ్చేందుకు రూ. 90 కోట్లు కేటాయించారు. వైద్య రంగంలో మరో ముందడుగుగా, సనత్ నగర్ టిమ్స్ (టిమ్స్) ఆసుపత్రిని జూన్ 2వ తేదీన ఓ మోస్తరు సేవలతో (పాక్షికంగా) ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
క్యాష్‌లెస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలు అప్‌లోడ్ చేయండి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలు దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్' ను ఏర్పాటు చేస్తూ, లబ్ధిదారులకు కొత్త హెల్త్ కార్డులు జారీ చేసేందుకు డేటా సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. అన్ని సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, పెన్షన్ మంజూరు అధికారులు ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగులు, పెన్షనర్ల వ్యక్తిగత వివరాలతో పాటు వారిపై ఆధారపడిన వారి సమాచారాన్ని నిర్ణీత ప్రోఫార్మాలో ఐఎఫ్ఎంఐఎస్హెచ్ఆర్ మాడ్యూల్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఈ బాధ్యతను ఆయా విభాగాల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు (డీడీఓలకు) అప్పగించారు. రాష్ట్ర సమగ్ర వైద్య నియమావళి-1972 (సెక్షన్-7) ప్రకారం అర్హులైన వారందరి డేటాను పక్కాగా సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డేటా సేకరణ ప్రక్రియకు ప్రభుత్వం మే 31, 2026 వరకు గడువు విధించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువులోగా వివరాల నమోదు పూర్తి చేయాలని, దీనిని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించి, ఎటువంటి తప్పులు లేకుండా డేటా అప్‌లోడ్ అయ్యేలా చూడాలని ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ డేటా సేకరణ పూర్తయితే, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నగదు రహిత వైద్యం (క్యాష్‌లెస్) ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది.
రూ.5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అమలుకానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 4వేల కోట్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ విధివిధానాలను సిద్ధం చేసింది.
జూన్ 2న ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే రోజున చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు, తదితర పెన్షన్లను మంజూరు చేసి, పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షనర్లకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
