- వారి ఆర్థికాభివృద్ధికిఆదాయ వనరుగా మారుస్తాం
- మంత్రులు సీతక్క, లక్ష్మణ్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి హామీ
- ప్రాజెక్ట్ పై ప్రజంటేషన్ ఇచ్చినఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మారుస్తామని ట్రైబల్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో మహువా ఫ్లవర్ ప్రాజెక్ట్ అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ మహిళలు, రైతులు, యువత, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రస్తుతం ఇప్ప పువ్వును సంప్రదాయ వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వు అటవీ ఉత్పత్తి మాత్రమే కాకుండా గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సూచించారు. ఎంపీ వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పపువ్వు ప్రాజెక్ట్‌ను చర్చల స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
