అటవీ భూముల్లో గ్యాస్ పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ !

అటవీ భూముల్లో గ్యాస్ పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ !
  •     మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ సంస్థ ప్రాజెక్టుకు షరతులతో ఆమోదం
  •     సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల పరిధిలో 0.2784 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు
  •     ప్రభుత్వ ఖజానాకు రూ.16.85 లక్షలు
  •     పరిహారంగా గజ్వేల్ అటవీ ప్రాంతంలో 1,700 మొక్కల పెంపకం

హైదరాబాద్, వెలుగు : సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతం గుండా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) పైప్‌‌‌‌లైన్ వేసేందుకు ప్రభుత్వం తుది (స్టేజ్-2) అనుమతులు మంజూరు చేసింది. 'మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్' (ఎంఎన్‌‌‌‌జీఎల్) చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇచ్చే అనుమతుల ఆధారంగా 'వన్ (సంరక్షణ్ ఏవం సంవర్ధన్) అధినియమ్ 1980 సెక్షన్-2 ప్రకారం భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 

ఈ మేరకు బుధవారం రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ జీవో విడుదల చేశారు. గ్యాస్ పైప్‌‌‌‌లైన్ నిర్మాణం కోసం రెండు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం 0.2784 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని లాల్‌‌‌‌గాడి మలక్‌‌‌‌పేట్, జప్తి సింగాయిపల్లి, నరసాంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ల మీదుగా 0.1591 హెక్టార్లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 0.1193 హెక్టార్ల అటవీ భూమిని ఇచ్చేందుకు అనుమతించారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన ఎంఎన్‌‌‌‌జీఎల్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రూ.16,85,487 ఇప్పటికే చెల్లించింది. అటవీ భూమికి బదులుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ అటవీ రేంజ్ పరిధిలోని నరసాంపల్లి ఆర్ఎఫ్ లో క్షీణించిన అటవీ భూమిలో 1,700 మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని తెలిపింది. 

పైప్‌‌‌‌లైన్ నిర్మాణ మార్గంలో తప్పనిసరైతేనే చెట్లను తొలగించాలని, గరిష్ఠంగా 218 చెట్లకు మించి నరకకూడదని, ఆ ప్రక్రియ రాష్ట్ర అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరగాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు వల్ల చెట్లను తొలగించడం ద్వారా ఆవాసాలు కోల్పోయే పక్షుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది. పర్యావరణ అనుకూల పదార్థాలతో కృత్రిమ పక్షి గూళ్లను తయారు చేసి సమీప అటవీ, మానవ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలు, నిబంధనల లీగల్ కాంప్లయన్స్ నివేదికలను రాష్ట్ర నోడల్ అధికారి, పీసీసీఎఫ్ నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.