హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, ఓఆర్ఎస్ , మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచించింది.
బయటకు వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్ ఉంచుకోవాలని, పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలని తెలిపింది. ఎండలో తిరిగేటప్పుడు లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని, గొడుగు లేదా టోపీతో తలను కవర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వంట చేసే సమయంలో గాలి ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలని పేర్కొంది.
మధ్యాహ్నం పూట జాగ్రత్త...
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలోకి వెళ్లడం ప్రాణాపాయమని ఆరోగ్య శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించింది. వడదెబ్బ తగిలితే వాంతులు, తీవ్రమైన తలనొప్పి, 104 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించింది.
ఎండల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మందులు సిద్ధం చేశామని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ తెలిపారు. పాత ఆహారం, మసాలా పదార్థాలు తినకుండా జాగ్రత్త పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
