- నేడు సెక్రటేరియెట్లో భేటీ
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు " తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్ర స్థాయి)" సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని 7వ అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్‌లో మీటింగ్ నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన వివిధ రకాల కీలక సమస్యలపై చర్చించేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ క్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత ప్రతినిధులందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని ప్రభుత్వం కోరింది. దాదాపు 15 ఏండ్ల తరువాత జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాయింట్ స్టాప్ కౌన్సిల్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇతర పెండింగ్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
