- రాష్ట్రవ్యాప్తంగా 68.43 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- ప్రభుత్వానికి నివేదిక అందజేసిన వ్యవసాయ శాఖ
- 11.02 లక్షల ఎకరాల్లో వరి నాట్లు
- అత్యధికంగా 43.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం పంటల సాగు గణనీయంగా తగ్గింది. ఈ సమయానికి సాధారణంగా 72.63 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 68.43 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 4.20 లక్షల ఎకరాల పంట సాగు తగ్గింది. 32 జిల్లాల్లో 51.69 శాతం పంటల సాగు నమోదైనట్టు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది. వానాకాలంలో సాధారణ పంటల సాగు 1.32 కోట్ల ఎకరాలు కాగా, ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంట సాగు కావాలని వ్యవసాయ శాఖ టార్గెట్ పెట్టుకున్నది. పత్తి 60 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు అత్యధికంగా పత్తి 43.70 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి 60 లక్షల ఎకరాలకు గాను.. దాదాపు 11.02 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. వరి సాధారణ సాగు 13.06 లక్షల ఎకరాలు కాగా, దాదాపు 2 లక్షల ఎకరాలు తగ్గింది. అదేవిధంగా మక్కలు 4.09 లక్షల ఎకరాలు, కంది సాగు 3.68 లక్షల ఎకరాలు, సోయా 3.55 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
పంట సాగులో సంగారెడ్డి జిల్లా టాప్..
పంట సాగులో సంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది. సంగారెడ్డి జిల్లాలో సాధారణ పంటల సాగు 7.28 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 5.91 లక్షల ఎకరాల్లో (81.22 శాతం) పంట సాగు అయ్యింది. ఆ తర్వాత నల్గొండలో సాధారణ సాగు 11.07 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు ఇప్పటివరకు 5.79 లక్షల ఎకరాల్లో (51.63%) పంటలు సాగయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 5.63 లక్షల ఎకరాలు (97.11 శాతం), నిజామాబాద్ జిల్లాలో 3.55 లక్షల ఎకరాల్లో పంటలు (68.14 శాతం) సాగయ్యాయి. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3.45 లక్షల ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 3.17 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.99 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.94 లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. నారాయణపేట జిల్లాలో 2.70 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 2.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. అయితే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాత్రం కేవలం 4,704 ఎకరాల్లోనే పంటలు సాగవడం గమనార్హం.
నిజామాబాద్‌లో అత్యధికంగా వరి సాగు..
వరి వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 65.95 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 60 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కాగా, ఇప్పటివరకు 11.02 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సాధారణ సాగులో 16.71 శాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. కామారెడ్డిలో 1.06 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 99 వేల ఎకరాలు, జనగామలో 95 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. భూపాలపల్లిలో 103 ఎకరాలు, గద్వాల జిల్లాలో 103 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 135 ఎకరాలు, నిర్మల్‌లో 200 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 828 ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయ్యింది.
మిల్లెట్ల సాగుపై ఆసక్తి చూపని రైతులు..
రాష్ట్రంలో పత్తి పంటను రైతులు ఎక్కువగా సాగు చేశారు. 43.70 లక్షల ఎకరాల్లో (92.16%) పత్తి వేశారు. మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 6.16 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.09 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 6.49 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.30 లక్షల ఎకరాల్లో (66.37%) సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా కంది పంట 5.44 లక్షల ఎకరాల సాధారణ సాగు కాగా, ఇప్పటివరకు 3.68 లక్షల ఎకరాల్లో వేశారు. పెసర్లు సాధారణ సాగు విస్తీర్ణం 64 వేల ఎకరాలు కాగా, ఈసారి ఇప్పటివరకు 49,591 ఎకరాల్లో (76.75%) వేశారు. మిల్లెట్ల సాగుపై దృష్టి సారించాలని సర్కారు చెబుతున్నా.. రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. జొన్న 18,831 ఎకరాల్లో సాగైంది. సజ్జ ఇప్పటివరకు 65 ఎకరాలు, రాగులు 75 ఎకరాల్లోనే సాగైనట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.
