- 3 కిలోమీటర్ల లోపే 99 శాతం అప్పర్ ప్రైమరీ స్కూళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి పిల్లాడికి బడిని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యలో రాష్ట్రం దాదాపు వంద శాతం లక్ష్యానికి చేరువలో ఉంది. విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ఇంటికి కూతవేటు దూరంలోనే బడులు అందుబాటులోకి రావడంతో డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది యాక్సెస్ రేషియో మరింత మెరుగుపడుతుందని ఆఫీసర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ 97.87 శాతం పురోగతి సాధించింది. కేవలం 473 (2.13 శాతం) ఆవాస ప్రాంతాల్లో మాత్రమే ఇంకా బడులు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన అప్పర్ ప్రైమరీ స్కూళ్ల విషయంలో రాష్ట్రం రికార్డు స్థాయి పనితీరు కనబరిచింది. ఏకంగా 99.04 శాతం ఆవాసాలకు ఈ సదుపాయం ఉంది. కేవలం 212 ప్రాంతాల్లో మాత్రమే కొరత ఉంది.
హైస్కూళ్లకు 5 కిలోమీటర్లు..
ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన హైస్కూళ్ల యాక్సెస్ ప్రస్తుతం 85.39 శాతంగా ఉంది. అంటే ఇంకా 3,241 గ్రామాల్లో విద్యార్థులు సెకండరీ విద్య కోసం దూరం వెళ్లాల్సి వస్తోంది. అలాగే, 7 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన హయ్యర్ సెకండరీ (ఇంటర్) స్కూళ్ల యాక్సెస్ 65.73 శాతంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7,604 గ్రామాలు ఇంకా ఈ సదుపాయానికి దూరంగానే ఉన్నాయి. ప్రైమరీ స్థాయి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించిన సర్కారు..
ఇప్పుడు హయ్యర్ సెకండరీ విద్యా సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించింది. 34.27 శాతం గ్రామాల విద్యార్థులు పైచదువుల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి రావడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల్లో కొత్తగా జూనియర్ కాలేజీలు, అదనపు సెక్షన్ల ఏర్పాటుకు కసరత్తు ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి హయ్యర్ సెకండరీ యాక్సెస్ రేషియో కూడా గణనీయంగా పెరగనుంది.
