హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంజూరైన ఎన్ హెచ్ఎం పోస్టుల్లో 86 శాతం పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 20,442 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 4,203 మంది కాంట్రాక్ట్ సిబ్బంది అని వెల్లడించింది. అంతేకాకుండా... మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా మరో 1,623 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, మొత్తంగా 15 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
జాతీయ స్థాయిలో అమల్లోకి వచ్చిన కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ వల్ల ఏర్పడిన టెక్నికల్ ఇబ్బంది వల్లే సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నదని వివరించింది. ప్రస్తుతం నిధులు విడుదలయ్యాయని, ఇకపై జీతాల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. అలాగే, కొన్ని చోట్ల మిషన్లు పనిచేయకపోవడం తాత్కాలికమేనని, ఏఎంసీ రెన్యువల్స్ పూర్తిచేసి చాలా వరకు రిపేర్లు చేయించామని వెల్లడించింది.
లేబర్ రూముల్లో ప్రైవసీ లేని చోట కర్టెన్లు, పార్టీషన్లు ఏర్పాటు చేశామని పేర్కొంది. ఆరోగ్యశ్రీ బకాయిలు, 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని, భద్రాద్రి కొత్తగూడెం లాంటి హాస్పిటల్స్ కు రావాల్సిన నిధులు ఇప్పటికే క్లియర్ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
